కరీంనగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ బదిలీ అయ్యారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఓఎస్డీగా ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. సోమవారం హైదరాబాద్లోని ఆయిల్ ఫెడ్లో శ్రీధర్ ఈ బాధ్యతలు స్వీకరించారు. 2017 జనవరి 30న జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టిన వాసిరెడ్డి శ్రీధర్, ఏడేళ్ల సుదీర్ఘ సేవలను అందించారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలోనే ప్రారంభించగా, ఆ కార్యక్రమాలను విజయవంతం చేశారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా రైతులకు అందించడంలో కీలకంగా వ్యవహరించారు.
దళిత బంధు పథకం అమలు చేయడంలో కూడా కీలక అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లా రైతులకు పలు ప్రత్యేక సేవలు కూడా అందించారు. ముఖ్యంగా పంటలపై ఆశించే తెగుళ్లు, రోగాలను నిర్ధారించేందుకు ఈ- సాయం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుని రైతులకు మంచి సేవలు అందించారు. ఈయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఇజ్రాయెల్, చైనా దేశాల పర్యటనలకు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో పంపించి అక్కడి వ్యవసాయ విధానాలను అధ్యయనం చేయించింది. జిల్లా అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న శ్రీధర్ అధికారుల మన్ననలు అందుకున్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి బదిలీ కావడంతో ఆత్మ పీడీగా విధులు నిర్వహిస్తున్న ప్రియదర్శినికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. సోమవారం ఈమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భగా ప్రియదర్శినిని కార్యాలయ సిబ్బం ది అభినందించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రణధీర్ కుమార్, ఏడీఏ (టైనింగ్) అంజనీ, సాంకేతిక వ్యవసాయ అధికారులు ఎం కృష్ణ, కే స్వప్న, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జ్యోతి, కరీంనగర్, కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారులు సత్యం, రంజిత్ పాల్గొన్నారు.