మానకొండూర్ రూరల్, ఆగస్టు 10: స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేందుకే సీఎం కేసీఆర్ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారని, వీటిలో ప్రజలందరూ పాల్గొనాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. తొలిపొద్దు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం మండలంలోని చెంజర్ల, వన్నారం, శంషాబాద్, గట్టుదుద్దెనపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కుల్లో మొక్కలు నాటారు. కల్యాణ లక్ష్మి లబ్ధిదారుల ఇండ్లకు స్వయంగా వెళ్లి చెక్కులతో పాటు కానుకగా చీరె అందజేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఊరూరా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. కాగా, వన్నారంలో ఎమ్మెల్యేకు సర్పంచ్ పొలాడి కవిత రాఖీ కట్టి సోదరభావాన్ని చాటారు.
అదే గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఇద్దరు టీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శేఖర్ గౌడ్, సర్పంచులు బొల్ల వేణు గోపాల్, దేవ సతీశ్‌రెడ్డి, పొలాడి కవిత, రమేశ్, ఎంపీటీసీ ఆకుల నర్సింగరావు, ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఎంపీవో రాజేశ్వర్ రావు, నాయకులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, పొలాడి వంశీధర్ రావు, గడ్డి గణేశ్, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, కడారి ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శులు, మహిళలు ఉన్నారు.