జగిత్యాల రూరల్, ఏప్రిల్ 25: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లా నుంచి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులను సభకు తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసీఆర్‌ను చూడడానికి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని, 15 నెలల దుర్మార్గపు పాలన ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా లేదన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు విసిగి పోయారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈనెల 27న గ్రామగ్రామాన బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి, సభకు తరలివెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్, బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సభకు తరలివెళ్తామని తెలిపారు. కాగా, అంతకుముందు జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, మండలాధ్యక్షుడు ఆనందరావు, పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సంగెపు మహేశ్, నాయకులు ఆనందరావు, వొల్లెం మల్లేశం, శీలం ప్రవీణ్, హరీశ్, తదితరులు పాల్గొన్నారు.
సభ ఏర్పాట్ల పరిశీలన
మెట్పల్లి టౌన్, ఏప్రిల్ 25: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు శుక్రవారం జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, రైతులను ఆగం చేసిందన్నారు. రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గడ్డం రాజారెడ్డి, ఆరెళ్ల రాజాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.