మంథని, ఫిబ్రవరి 20: మంథని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన దాదాపు 1,800 మంది నిరుద్యోగులు తరలిరావడంతో మంథని ఎస్ఎల్బీ ఫంక్షన్ హాల్ సందడిగా మారింది. ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి, భూపాలపల్లి జడ్పీ అధ్యక్షులు పుట్ట మధూకర్, జక్కు శ్రీహర్షిణీరాకేశ్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 52 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని, ఇంటర్వ్యూలు నిర్వహించారు. 1052 మంది నిరుద్యోగులు 47 బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.
వీరంతా 15వేల నుంచి 40వేల వరకు వేతనాలు అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు పుట్ట మధూకర్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. అదే విధంగా మెగా జాబ్ మేళాకు సహకరించిన ఆయా కంపెనీల హెచ్‌ఆర్‌లను పుట్ట మధూకర్ శాలువా, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో భోజన వసతి, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేశ్, తగరం సుమలతాశంకర్లాల్, కొత్త శ్రీనివాస్, ఎక్కటి అనంతరెడ్డి, కొండా శంకర్, ఎగోలపు శంకర్‌గౌడ్, పూదరి సత్యనారాయణగౌడ్, ఆరెల్లి దేవక్కాకొమురయ్య, కనవేన శ్రీనివాస్‌యాదవ్, వీకే. రవి, కుర్రు లింగయ్య, యాకుబ్, నక్క శంకర్, కొట్టే రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యం
అట్టడుగు వర్గాల అభ్యున్నతే మా లక్ష్యం. ఆ దిశగా మంథని నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలన కోసం కృషి చేస్తున్న. పదేళ్ల క్రితమే నా తల్లి పేరిట ట్రస్టును స్థాపించి పేద, బడుగు, బలహీన వర్గాలకు సేవలందిస్తున్నం. ప్రభుత్వ కాలేజీల్లోని పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నం. విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించే దిశగా ప్రతి కళాశాల, మోడల్ సూళ్లలో మోటివేషన్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నం. నియోజకవర్గంలోని నిరుద్యోగుల కోసం పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 52 బహుళజాతి కంపెనీలతో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినం. ఈ మేళా ద్వారా ప్రతి ఒకరికీ ఉద్యోగ అవకాశాలు లభిస్తయ్. ఉద్యోగాలు సాధించిన వారు తమ వేతనం నుంచి ప్రతి నెలా ఒక్కో రూపాయి పుట్ట లింగమ్మ ట్రస్టుకు విరాళంగా ఇవ్వాలి. ఆ విరాళాలను పేద ప్రజలు, యువతీ యువకులకు ఉపయోగపడేలా ఖర్చు చేస్తం.
– పుట్ట మధూకర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్,బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి
సద్వినియోగం చేసుకోవాలి
నేను రాజకీయాల్లోకి రాక ముందు బెంగళూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసిన. ఆనాడు ఉద్యోగాలు రావాలంటే ఎంతో కష్ట పడాల్సి ఉండేది. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య నిర్మూలించేందుకు జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆలోచన చేసిండు. పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయించిండు. దీనిని అదృష్టంగా భావించాలి. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.
–జక్కు శ్రీహర్షిణి,భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్
చదువుకునే చోటే ఉద్యోగం
నేను కరీంనగర్‌లోని మహిళా డిగ్రీ కాలేజీలో సెకండియర్ చదువుతున్న. పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు వచ్చిన. నాకు వరుణ్ మోటర్స్‌లో రిసెప్షనిస్టుగా కరీంనగర్లో ఉద్యోగం వచ్చింది. 12వేల వరకు జీతం ఇస్తామన్నరు. నా చదువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగం చేసుకోవచ్చు. చదువుకునే చోటనే ఉద్యోగం రావడం హ్యాపీ. నా చదువును నేను కొనసాగిస్తూనే నా తల్లిదండ్రులకు ఎంతో కొంత ఆసరాగా నిలుస్త.
– తాడూరి అమూల్య,మచ్చుపేట (ముత్తారం)
ఫుల్ హ్యాపీ
నేను ఇంటర్ తర్వాత ఐటీఐ చేసిన. ఎన్టీపీసీలోని ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేసిన. అయితే కాంట్రాక్టు అయిపోవడంతో నా ఉద్యోగం పోయింది. ఎనిమిది నెలల నుంచి ఏపనీ లేక ఇంటి వద్దే ఉంటున్న. మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేశారని తెలిసి ఇంటర్వ్యూ కోసం వచ్చిన. నా అదృష్టం ఏమిటంటే నాకు మంథనిలోని వరుణ్ మోటర్స్ వర్క్‌షాపులో జాబ్ వచ్చింది. 15వేల సాలరీ ఇస్తమన్నరు. ఎక్కడికో వెళ్లకుండా దగ్గరలోనే జాబ్ దొరికింది. నిజంగా నేను ఫుల్ హ్యాపీ.
– జే ప్రశాంత్, సుందిళ్ల (రామగిరి)