నూకపెల్లి డబుల్ బెడ్రూం ఇండ్ల ముచ్చట ఒడవని కథలా మారింది. బీఆర్ఎస్ పాలనలో దాదాపు రూ.400 కోట్లతో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినా.. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు గోస పడాల్సి వస్తున్నది. సరైన రోడ్లు, డ్రైనేజీలు, విద్యుద్దీపాలు, తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. అప్పుడప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చి హడావుడి చేయడమే తప్పా పరిష్కారం కరువైంది. నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబుల్ బెడ్రూం కాలనీని పరిశీలించనున్న నేపథ్యంలో అధికారులు ఆగమేఘాలపై పూతలు పెడుతుండగా, స్థానికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
జగిత్యాల, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ)/ జగిత్యాల రూరల్ : ఉమ్మడి రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి 2008లో జగిత్యాల పట్టణంలోని నిరుపేదలకు పెద్ద ఎత్తున ఇండ్ల పట్టాలను మంజూరు చేసి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం కింద రుణ సౌకర్యం కల్పించారు. దాదాపు 200 ఎకరాల భూమిని సేకరించి దాదాపు 4వేల మందికి 70 గజాల చొప్పున ఇండ్ల పట్టాలు మంజూరు చేసి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవకాశం ఇచ్చారు. రూ.70వేల రుణం కూడా ఇప్పించారు. కాలనీకి విద్యుత్ సౌకర్యం సైతం కల్పించారు. పట్టా పొందిన వారిలో ఐదారు వందల మంది ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని అందులో చేరిపోయారు. దాదాపు 2800 మంది ఇండ్ల నిర్మాణాలను చేపట్టారు.
అయితే ఆ తర్వాత వచ్చిన మార్పుల నేపథ్యంలో చాలా మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని నిలిపివేశారు. అయితే స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో స్పెషల్ కోటా కింద జగిత్యాల పట్టణానికి 4,500 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారు. నూకపెల్లి ఇందిరమ్మ కాలనీలోనే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీంతో అప్పటికే వివిధ దశల వరకు నిర్మించి ఉన్న 1500 ఇందిరమ్మ ఇండ్లను కూల్చివేసి, నిర్మాణం చేపట్టని ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకొని నిర్మాణం ప్రారంభించారు. ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. దాదాపు రూ.400 కోట్ల నిధులతో కేసీఆర్ ప్రభుత్వం 4,520 డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేసింది. 2023 అక్టోబర్ 3వ తేదీన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇండ్లను అప్పగించింది.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినా కాలనీలో అవస్థాపన సౌకర్యాలు కల్పించకపోవడం ఇబ్బందికరంగా మారింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. నిధుల లేమితో డబుల్ బెడ్రూం కాలనీలో ఎలాంటి పనులు చేపట్టలేని దుస్థితి నెలకొంది. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో నిధుల మంజూరు కోసం యత్నించినా.. అయితే ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. కాలనీలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడాయి. జగిత్యాల-కరీంనగర్ రోడ్డు నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాలనీ సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో ట్రాన్స్పోర్టేషన్కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఎక్కడా సరైన మురుగు కాలువల నిర్మాణం చేపట్టలేదు. దీంతో మురుగు నీరు ఆవాసాల మధ్య నిలిచిపోతున్నది. రెండేండ్ల పాటు విద్యుత్ సమస్య పరిష్కారం కాలేదు. డబుల్ బెడ్రూం ఇండ్లల్లో కరెంట్ మీటర్ల బిగింపు లేకపోవడంతో లబ్ధిదారులు ఇండ్లలో నివాస ముండలేకపోయారు. కాలనీకి సమీపంలో మొత్తం అటవీ ప్రాంతం కావడం, రక్షణగా ఎలాంటి గోడల నిర్మాణం లేకపోవడంతో అటవీజంతువులు, విషకీటకాలు, పాములతో ప్రమాదం ఏర్పడింది. దీనికి తోడు డబుల్ బెడ్రూం ఇండ్లకు మరుగుదొడ్లు నిర్మించినా, మలమూత్రాల కోసం ట్యాంకులు నిర్మించకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఇక కాలనీ ఉన్న స్థలంలో నీటి లభ్యత లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్యాంకర్ ద్వారా వచ్చిన నీటిని కింది పోర్షన్లో నీటి ట్యాంకులో పోసుకొని, మూడో అంతస్తులో ఉన్న ఇంటికి నీటిని చేర్చుకోవడం పెద్ద సమస్యగా మారిపోయింది.
అలాగే పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, వైద్య కేంద్రం, రేషన్ షాప్ లాంటి అవస్థాపన సౌకర్యాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇండ్లలోకి రావడమే మానేశారు. పలు సందర్భాల్లో నిధులు మంజూరు అయ్యాయని, సౌకర్యాల కల్పన చేస్తున్నామని ప్రజాప్రతినిధులు పేర్కొనడం, పర్యటించడం పరిపాటిగా మారినా.. కాలనీ సౌకర్యాల కల్పనలో మాత్రం ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. కాలనీకి సమీపంలో ఉన్న డంప్ యార్డు ప్రధాన సమస్యగా మారిపోయింది. అలాగే రక్షిత మంచినీటి వసతి సైతం అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్రంగా గోస పడుతున్నారు.
డబుల్ బెడ్రూం కాలనీలో ఉన్న సమస్యల పరిష్కరించాలంటూ పలుసార్లు ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ప్రస్తావించారు. ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ ఎల్ రమణ డబుల్ బెడ్రూం ఇండ్లలో సౌకర్యాలు లేవని, లబ్ధిదారులు ఇండ్లల్లో నివాసం ఉండడానికి ఇష్టపడడం లేదని, ఇరవై ముప్పై శాతం డబుల్ బెడ్రూం ఇండ్లల్లో మాత్రమే లబ్ధిదారులు ఉంటున్నారని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి స్వయంగా ఇండ్లను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. కాగా, శుక్రవారం మంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో అధికారులు ఆగమేఘాలపై కాలనీలో పనులు చేపడుతున్నారు. రోడ్ల మరమ్మతులతోపాటు ఇతర సమస్యలను తాత్కాలికంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో జిల్లా కలెక్టర్ మూడు సార్లు కాలనీలో పర్యటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అయితే వారానికో.. లేదా నెలకోసారి మంత్రి పర్యటన ఉంటే బాగుండని, అప్పుడైనా తమ కాలనీ సమస్యలు పరిష్కారం అయ్యేవని కాలనీవాసులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నూకపల్లిలోని 4500 డబుల్ బెడ్రూం ఇండ్లలో సుమారు 2వేల మంది నివసిస్తున్నరు. సొంతింటి కల నెవేరిందే తప్ప ఇక్కడ అన్నీ సమస్యలే. మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ కావడంతో గృహాలకు నీళ్లు వస్తలేవు. విద్యార్థులు, కార్మికులు జగిత్యాలకు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేదు. ఆటోలే దిక్కయితున్నయి. కొత్త బస్టాండ్ వరకు 30 రూపాయలు తీసుకుంటున్నరు. అలాగే డంపు యార్డ్ పొగతో అనారోగ్యం బారిన పడుతున్నరు. డంప్ యార్డు తొలగించాలని అధికారులకు చెప్పినా ఫలితం లేదు. ఇక్కడ ఉపాధి ఏమీ లేదు. ఉపాధి కోసం జగిత్యాలకే పోవాల్సి వస్తంది. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు కూడా లేవు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి డబుల్ బెడ్రూం ఇండ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
– పీఎన్ స్వామి, కాలనీ నివాసి
నేను పదేళ్ల సంది డబుల్ బెడ్రూం ఇంటిలో ఉంటున్న. మా కాలనీలో ఏవీ సక్కగా లేవు. విద్యుత్ స్తంభాలు లేవు. ఇండ్లలో నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ పై మూతలు లేవు. అలాగే వాటర్ ట్యాంక్ పైప్లైన్ పగిలి నీరు రూములలో జల్లు వస్తంది. ఫోన్ సిగ్నల్ కూడా వస్తలేదు. మా ఇంటి పకన గుట్టకు ఫినిషింగ్ ఏర్పాటు చేయాలి. నాకు కూలర్, ఏసీ ఏమీ లేకున్నా కరెంట్ బిల్లు నెలకు రూ.1500 బిల్లు వస్తంది. మూడు నెలలకోసారి కొడితే రూ.3వేలు వస్తంది. ఇట్లయితే ఎట్ల బతుకుతం?
– కే సునీత, కాలనీ వాసి