జ్యోతినగర్, జూన్ 28: తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తున్నదని, సీఎం కేసీఆర్ తీసుకొస్తున్న పథకాలతో వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ప్రధాన ధ్వేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరై, మాట్లాడారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ గణనీయమైన వృద్ధిని సాధించిందని, ఏటా కోటి ఎకరాల్లో వరి సాగు జరుగుతోందన్నారు. గత ఒక్క ఏడాదే ప్రభుత్వం 1.18 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని చెప్పారు. కేంద్రం రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నా సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. పంట పెట్టుబడులకు మంగళవారం నుంచే సాయం అందిస్తున్నామని, 68 లక్షల మంది రైతుల ఖాతాలో దాదాపు 7,650 కోట్లను జమ చేస్తున్నట్లు వివరించారు.
జిల్లాలో 1.49లక్షల మంది రైతుల ఖాతాల్లో 139 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 319 రైతులు మృతిచెందితే రైతు బీమా కింద వారి కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం అందించినట్లు గుర్తు చేశారు. జిల్లాలోని రైతు వేదికలను మరింతగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని, రైతు వేదికల్లో పంట మార్పిడి, నూతన సాగు పద్ధతులపై రెగ్యులర్గా అవగాహన కల్పించాలని, క్షేత్ర స్థాయిలో డీఏఓ తనిఖీలు చేయాలని ఆదేశించారు. హార్టికల్చర్ శాఖ ద్వారా జిల్లాలో 10,340 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రణాళికలు వేశామని, అప్పటికే అనువైన 7వేల ఎకరాలను గుర్తించి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. జిల్లాలో మత్స్య సమీకృత అభివృద్ధి పథకం కింద చెరువులు, కుంటల్లో 1.5కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశామని, దళారులతో పని లేకుండా మొత్తం మత్స్య శాఖ సొసైటీలకే హక్కులు కల్పించినట్లు వివరించారు. ‘మన ఊరు- మన బడి’ కింద పాఠశాలల్లో ప్రారంభించిన పనులను ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం బోధన, మౌలిక సదుపాయాల కల్పనతో ఈ యేడాది 1500 మంది విద్యార్థుల సంఖ్య పెరిగిందని విద్యాశాఖ అధికారి తెలిపారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించారు. జిల్లాలో నూతన మాతా శిశు సంరక్షణ కేంద్రలో పూర్తి స్థాయి సేవలు త్వరగా ప్రారంభించాలని మంత్రి సూచించారు. 29 ప్రాథమిక సబ్ సెంటర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మరో 50 సబ్ సెంటర్ భవనాల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగించుకొని, నూతన సాగు పద్ధతులను ప్రోత్సహించి పెట్టుబడి తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 150 కిలో మీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉందని, వాటిలో విరివిగా చేపలు పెంచి మత్స్యకారులకు మరింత ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇసుక రవాణాకు సంబంధించి నిబంధనలను పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచించిన అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ లక్ష్య సాధనకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇక్కడ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.