ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకం ప్రకటనపై హర్షాతిరేకాలు lఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు
జీవితాంతం రుణపడి ఉంటామని ప్రతిన
కరీంనగర్/పెద్దపల్లి, జూన్ 28 (నమస్తే తెలంగాణ), ఎల్లారెడ్డిపేట/జగిత్యాల టౌన్/ హుజూరాబాద్ రూరల్/ మానకొండూర్ రూరల్/ జూన్ 28 : దళితుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్, తాజాగా ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకాన్ని’ ప్రకటించడంపై దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా సామాజిక వివక్ష, అణచివేతకు గురవుతున్న తమ జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారంటూ సంబురాలు చేసుకుంటున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేసి జీవితాంతం రుణపడి ఉంటామని ప్రతినబూనారు.
స్వరాష్ట్రంలో దళితుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. తాజాగా, ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో దళితుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. 1200 కోట్లతో ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత’ పథకం ప్రకటించారు. ఒక్కో నిరుపేద కుటుంబానికి 10 లక్షల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో వేయాలని, మొదటి విడుతగా నియోజకవర్గానికి 100 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని చెప్పడంతో దళితులు ఆనందంలో మునిగిపోయారు. ఇదొక్కటే కాదు, దళిత విద్యార్థులకు సివిల్ సర్వీసెస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ, పెండింగ్‌లో ఉన్న దళిత ఉద్యోగులకు ప్రమోషన్లు, భూమి ఉన్న దళిత రైతులకే కాకుండా, భూమిలేని నిరుపేద కుటుంబాలకు కూడా బీమా సౌకర్యం, సామాజిక బాధల నుంచి విముక్తి కల్పిచడం, దళితులపై పోలీసుల దాడులు జరిగితే వారిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం, దళిత సాధికారత విషయంలో సీఎంవోలోనూ ప్రత్యేక అధికారి నియామకం.. ఇలా ఎన్నో నిర్ణయాలు తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఇసొంటి నిర్ణయాలు తీసుకుంటే దళితుల అభివృద్ధి ఎప్పుడో జరిగేదని, సీఎం కేసీఆర్ పాలనలో తమకు మంచి రోజులు వచ్చాయని పేర్కొంటున్నారు.
ఎస్సీలకు కొండంత భరోసా
దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి వారి స్వావలంబన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ “సీఎం దళిత సాధికారత పథకాన్ని’ ప్రవేశపెట్టడడం సంతోషం. నిరుపేద కుటుంబాలు యూనిట్‌గా 10 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలన్న నిర్ణయం హర్షనీయం. ఇది దళిత జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరికీ కొండంత భరోసానిస్తుంది. ఇంత గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
ఉమ్మడి రాష్ట్రంలో దళితులను పట్టించుకున్న ముఖ్యమంత్రి లేరు. బ్యాంకు రుణం కావాలంటే 50 శాతంలోపే సబ్సిడీ ఉండేది. మన సీఎం కేసీఆర్ 80 శాతం సబ్సిడీపై ఒక్కో యూనిట్ 10 లక్షల దాకా పెంచారు. ఇప్పటి వరకు దాదాపు 7వేల ఎకరాల భూమి పంపిణీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గురుకులాల్లో ఒక్కో విద్యార్థికి 25 వేలు ఖర్చు చేస్తే కేసీఆర్ ఇప్పుడు 1.25 లక్షలు వెచ్చిస్తున్నారు. కార్పొరేషన్ రుణాల ద్వారా ఎంతో మంది డ్రైవర్లను ఓనర్లుగా చేశారు. గురుకులాల్లో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు. నేడు ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు ప్రకటించడం దళితుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర దళితుల పక్షాన ధన్యవాదాలు.