ఆత్మగౌరవమంటూ వచ్చి హేళన చేస్తున్నడు
క్యాడర్‌ను అణగదొక్కుతున్నడు
ఆయనకు తెలిసింది కుట్రలు, కుతంత్రాలే
ఆక్రమణదారుడిని బీజేపీలో చేర్చుకునుడే తప్పు
క్యాడర్లో సంతోషమే లేకుంట పోయింది
ఇంకా చాలా మంది బయటికి వస్తరు
ఈటలపై టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేతల ధ్వజం
ఆయన ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రతిన
ఇల్లందకుంట, జూన్ 27: ““ఆత్మగౌరవం అంటూ పార్టీలోకి వచ్చిన ఈటల కుట్రలు.. కుతంత్రాలనే నమ్ముకున్నడు. ఆయన అనుచరులతో హంగామా చేస్తూ ఏండ్లపాటు పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న మమ్ములను అణగదొక్కుతున్నడు. ఇదేంటని అడిగితే ‘ఉంటె ఉండుర్రి లేదంటే బయటికి పోండ్రి’ అంటూ బెదిరిస్తున్నడు. ఇదెక్కడి విధానం. ఆత్మగౌరవమంటూ పార్టీలో చేరినోడు మమ్ముల హేళన చేసి మాట్లాడడం కరక్టేనా” అంటూ ఈటల రాజేందర్ తీరుకు నిరసనగా బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన నాయకులు భగ్గుమంటున్నరు. టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చే పార్టీలో చేరామని పేర్కొన్న నాయకులు, అసలు ఈటల ఎంట్రీతో బీజేపీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని,తామెంత ఎంత వద్దని వారించినా అధిష్టానం వినలేదు.. ఇప్పుడు చేర్చుకుని అనుభవిస్తున్నరని దుయ్యబట్టారు. తామే కాదు చాలా మంది బయటికి వస్తారంటూనే ఈటల ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ కుట్రలు కుతంత్రాలే నమ్ముకున్నడు. పార్టీలోకి వచ్చుడచ్చుడే చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నడు. పాత క్యాడర్‌ను అణగదొక్కుతున్నడు” అని అంటూ ఈటల రాజేందర్ తీరుపై బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లోనే..
ఈటల ఓటమే నా లక్ష్యం..
ఏళ్ల తరబడి బీజేపీలో పనిచేస్తున్న. పార్టీ బలోపేతానికి ఎంతో కృషిచేసిన. కానీ ఈటల, ఆయన అనుచరుల వ్యవహార శైలి నన్ను తీవ్రంగా బాధించింది. పాత క్యాడర్‌కు ఎలాంటి గౌరవం ఇస్తలేరు. పైగా హేలనగా మాట్లాడుతున్నరు. అణచివేయాలని చూశారు. అందుకే బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన. వచ్చే ఉప ఎన్నికల్లో ఈటల ఓటమే లక్ష్యంగా పనిచేస్తా. ఇల్లిల్లూ తిరిగి ప్రతి ఒక్కరినీ కలిసి చైతన్యవంతం చేస్తా.
ఆస్తుల రక్షణకే బీజేపీలో చేరిండు..
నేను బుద్ధి నేర్చిన కాన్నుంచి బీజేపీలో పనిచేస్తున్న. పార్టీల కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశా. అంత బాగానే ఉందనుకుంటున్న టైంల ఈటల ఎంట్రీతో బీజేపీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. పార్టీలోకి వచ్చిన ఈటల, ఆయన అనుచరులు పాత క్యాడర్‌ను పట్టించుకుంట లేరు. వారికి నచ్చిందే చేస్తున్నరు. అసలు రాముని భూములు ఆక్రమించిన ఈటలను పార్టీలో చేర్చుకోవడమే తప్పు. తిరిగి వాటిని దేవాలయానికి అప్పగించాలి. ఆస్తులు, భూముల రక్షణకే బీజేపీలోకి వచ్చిండు. అవి నచ్చకనే టీఆర్ఎస్లో చేరిన.