చొప్పదండి, మే 2: రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్నే గెలుపు వరిస్తుందని మరోసారి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డిపై భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్ని పన్నాగాలు పన్నినా ఓటర్లు తెలంగాణ ప్రభుత్వం వైపే ఉంటామని రుజువు చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులకు శ్రీరామ రక్ష అన్నారు. ఆ పథకాలతోనే టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రత్యర్థులపై అలవోకగా గెలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై భగత్ గెలుపొందడం ఆనందంగా ఉందన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతైందని, ఆ పార్టీ నాయకులు ఇకనైనా తమ తీరు మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సోమవారం వెలువడే మున్సిపల్ ఫలితాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మండే ఎండల్లో.. ముంజలు సూపర్
రామడుగు, మే 2: వేసవి తాపం పెరిగి ఎండలు ముదురుతుండగా.. ఇలాంటి సమయంలో ముంజలు తీసుకోవడం మంచిదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం మోతెవద్ద మోతె వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం నిర్మాణాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక గీత కార్మికుడు పలుకరించారు. ఎమ్మెల్యే కోసం తాటిముంజలను కోసి అందించగా, ఆయన బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. గీత కార్మికులను ఆదుకునేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీరా పాలసీని ప్రవేశపెట్టిందన్నారు. ఇక్కడ ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, కొక్కెరకుంట విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి ఉన్నారు.