ఎండపల్లి ఎండుతున్నది. సాగునీరు లేక పొలంనెర్రెలువారుతున్నది. వారబందీ నీళ్లు రాక కాలువ ఆనవాళ్లు కోల్పోగా.. కండ్లముందే పంట ఎండిపోతుంటే రైతు కంట కన్నీరు వస్తున్నది. ఇప్పటికే 50 ఎకరాల్లో పంట ఎండిపోగా, పరిస్థితి ఇలాగే ఉంటే మరో వందెకరాలు చేతికందకుండా పోయే ప్రమాదమున్నది.
వెల్గటూర్, మార్చి 3 : గొల్లపల్లి మండలం రంగధామునిపల్లి వద్ద ప్రారంభమయ్యే ఎస్ఆర్ఎస్పీ డీ 83/ఏ కాలువ ద్వారా వారబంధీ లెక్కన నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు సంతోష పడ్డారు. కాలువ పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయని, బావుల కింద ధైర్యంగా వరి సాగు చేసుకున్నారు. కానీ, పేరుకే వారబంధీ అయింది.
రంగధామునిపల్లి చెరువు నిండిన తర్వాత అక్కడి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎండపల్లికి నీళ్లు రావాల్సి ఉంటుంది. అయితే, చెరువు నిండినా కాలువ చెత్తా చెదారం, పిచ్చిమొక్కలు, పూడిక పేరుకుపోవడంతో ఇక్కడి వరకు రావడం గగనమే అయింది. ఇక ఎండపల్లి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబారిపేట వరకు కాలువ ఉన్నా అక్కడి రైతులు ఆశలు వదులుకున్నారు. ఎండపల్లి, అంబారిపేట వరకు కనీసం ఒక్కసారి కూడా సాగునీరు రాక పోవడంతో కాలువలు, బావుల కింద పంటలు ఎండిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ఎండపల్లి మండల కేంద్రంలో సుమారు 520 ఎకరాల్లో 150 మంది రైతులు వరి సాగు చేయగా, నీళ్లు లేక ఇప్పటి వరకు సూమారు 25 మంది రైతులకు చెందిన 55 నుంచి 60 ఎకరాలల్లో పంట ఎండిపోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే మరో వందెకరాలు సైతం ఎండే ప్రమాదమున్నది. ఈ విషయం అధికారులకు తెలిపినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో పాలు పోక రైతులు తమ పంట పొలాల్లో పశువులను మేపుతున్నారు.
భూమి కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతులు కంటతడి పెడుతున్నారు. గడిచిన పదేండ్లలో ఏనాడు సాగు నీళ్లకు ఇబ్బంది పడలేదని కేసీఆర్ పాలనను గుర్తు చేసుకున్నారు. పంటలు ఎండుతున్న విషయాన్ని ఎస్సారెస్పీ డీఈఈ రమేశ్‌ను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన సమాధానం దాటవేయడం గమనార్హం.
అంతా బుగ్గిపాలైంది
నేను ఎకరాకు రూ.15 వేల చొప్పున 5 ఎకరాలు కౌలుకు తీసుకున్న. కొంత పత్తి వేసి నాలుగు ఎకరాల్లో వరి వేసిన. మొన్నటి వరకు వరికి రోగం వస్తే రూ.వేలకు వేలు ఖర్చు పెట్టి మందులు కొట్టిన. కొద్దిగ మంచిగైనంక ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోతున్నది. పొలమంతా కాలువ పక్కనే ఉన్నా ఏనాడూ కాలువ నీళ్లు రాలేదు. బావిల నీళ్లు అడుగంటి రెండెకరాలు ఎండిపోయింది. ఉన్నది కాపాడుకునేందుకు కాలువ నీళ్లకు పోతే పైన ఉన్న రైతులు కాల్వకు గండి కొట్టుకుని కిందకు రాకుండా చేస్తున్నరు. అధికారులను అడిగితే నీరు వదులుతున్నామంటున్నరు. కానీ, మాకైతే అందుతలేవు ఏం చేయాలో అర్థంకాక పశువులను మేపుతున్న.
– సబ్బ స్వామి, రైతు (ఎండపల్లి)
కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడే బాగుండె
కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు నేను ఏనాడూ బావిల పూటిక తీయలేదు. ఇప్పుడు నీరు అడుగంటడంతో నాకున్న రెండెకరాల పంటను కాపాడుకునేందుకు భారీ ప్రొక్లేన్తో పూటిక తీయిస్తున్న. లోపల మొత్తం బండరాయి వచ్చింది. దీన్ని పగుల కొట్టేందుకు డ్రిల్లింగ్ చేయిస్తున్న. ఇప్పటికే 60 వేలు ఖర్చయినయ్. ఇంకెన్ని అయితయో తెలుస్తలే. గతంలో మాకు ఈ బాధ లేకుండె. మాకు ఇప్పుడు ఎందీ గోస.
– అన్నె శంకరయ్య, రైతు
మా కంట్లో మేమే మట్టి కొట్టుకున్నం
మార్పు వస్తే మాకు మంచి జరుగుతుందనుకుంటే మా కంట్లో మేమే మట్టి కొట్టుకున్నట్లయింది. కేసీఆర్ సార్ ఉన్నన్ని రోజులు మాకు ఈ గోస లేదు. కరెంటు మోటర్ వేసుకుని ఇంట్లో పడుకున్న. రాత్రంతా మోటర్ నడిచినా బావిల నీళ్లు ఐపోలే. ఇంత బాధ ఏనాడూ పడలే. రాత్రి కాల్వ నీళ్లకు పోతే మళ్లీ పాత రోజులు గుర్తుకు వచ్చినయ్. పాములు, తేళ్లు ఎదురు పడుతున్నయ్. దయచేసి మాకు ఒక్క 20 రోజులు నీరందిస్తే కొంత వరకు బయటపడుతం.