ఉమ్మడి జిల్లాలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్స్‌కు సంబంధించిన షెడ్యూల్ రాకముందే కొన్ని కాలేజీలు మేనేజ్మెంట్ కోటా కింద ప్రవేశాలు తీసుకొని రసీదులు ఇవ్వగా, మరికొన్ని మాత్రం ప్రభుత్వ నిర్ణీత ట్యూషన్ ఫీజు కన్నా అదనంగా గుంజుతున్నాయి. ఈ తరహా విధానం చాలా కాలేజీల్లో జరుగుతుండగా.. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో ఉన్న ప్రముఖ కళాశాల మినహా మిగిలిన కాలేజీల్లో నడుస్తున్న ఈ దందా తీరుపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు వెళ్లాయి. సదరు యాజమాన్యాలు పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, తిమ్మిని బమ్మి చేస్తూ అడ్మిషన్లు పొందుతున్నారన్న విమర్శలను ఇప్పటికే ఎదుర్కొంటున్నాయి. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న ఫీజుల వ్యవహారం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
కరీంనగర్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (టీజీఈఏపీసీఈటీ) ద్వారా అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి జూన్ 28న షెడ్యూల్ విడుదలైంది. నిబంధనల ప్రకారం ప్రతి ఇంజినీరింగ్ కళాశాల షెడ్యూల్ నిబంధనలకు లోబడి ఉండాలి. కానీ, తిమ్మాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాల మాత్రం షెడ్యూల్ విడుదలకు ముందుగానే.. అంటే జూన్ 23వ తేదీనే ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ (ఈఈఈ)లో అడ్మిషన్ కోసం 10వేల ఫీజు కలెక్ట్ చేయడంతోపాటు అందుకు సంబంధించిన రిసిప్టు జారీ చేసింది. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం కాగా, ఉన్నత విద్యామండలి నుంచి వచ్చే ఆదేశాలకు ముందుగానే యాజమాన్యాలు సీట్లు అమ్ముకుంటున్నట్టు దీని ద్వారా మరోసారి తేటతెల్లం అవుతున్నది.
ఈ దందా ఒక విద్యార్థికి మాత్రమే పరిమితం కాలేదని తెలుస్తున్నది. పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, షెడ్యూల్‌కు ముందుగానే విద్యార్థులతో ఒప్పందాలు చేసుకొని, వారికి అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒక వేళ వారికి కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినా.. వసూలు చేసిన ఫీజులు వాపసు ఇవ్వకుండా సొమ్ము చేసుకుంటున్నాయి. స్టూడెంట్ వారీగా విచారణ చేస్తే మొత్తం అక్రమాలు బయటకు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఒక్కో కళాశాలకు ఒక్కో రకమైన ట్యూషన్ ఫీజును నిర్ధారిస్తుంది. మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థుల వద్ద కూడా టీఏఎఫ్ఆర్సీ నిర్ధారించిన ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలి. కానీ, మండలంలోని పలు కళాశాలలు పూర్తిగా నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఓ కళాశాల తాను వసూలు చేయాల్సిన ట్యూషన్ ఫీజు కంటే ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా 7వేలు కలుపుకొని 70వేలు వసూలు చేసి రసీదులు జారీ చేసింది.
అక్కడితో ఆగకుండా, ఇదే కళాశాల మరింత ముందుకెళ్లి కొంత మంది విద్యార్థుల నుంచి నిర్ధారిత ట్యూషన్ ఫీజుకన్నా అదనంగా 15వేల వరకు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. అందుకు సంబంధించిన రిసిప్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో ఇంజినీరింగ్ కళాశాల తాను వసూలు చేయాల్సిన నిర్ధారిత ట్యూషన్ ఫీజు కన్నా 15వేలు అదనంగా వసూలు చేస్తున్నది. అయితే రిసిప్టు మాత్రం నిర్ణీత ఫీజుకే ఇస్తూ.. మిగిలిన డబ్బులను కళాశాల రికార్డుల్లో రాస్తూ.. ఆ తదుపరి విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నది. తాజాగా ఓ విద్యార్థి సదరు కళాశాలలోని ఒక విభాగంలో మేనేజ్మెంట్ కోటా కింద సీటుకు వెళ్లగా 70వేల ట్యూషన్ ఫీజు చెల్లించాలని షరతు పెట్టారు. ఆ మేరకు చెల్లింపునకు ఒప్పందం చేసుకొని, ఒరిజనల్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ముందుగా 35వేలు చెల్లించడంతో ఆ మేరకు రిసిప్టు ఇచ్చారు. ఈ డబ్బులు చెల్లించిన ఒకటి రెండు రోజులకే సదరు విద్యార్థి వెళ్లి, తనకు సీటు అవసరం లేదని, మీరు వసూలు చేయాల్సిన ట్యూషన్ ఫీజు కన్నా నా వద్ద ప్రతి సంవత్సరం 15వేలు అదనంగా వసూలు చేస్తున్నారని, నాకు సర్టిఫికెట్లు ఇస్తే వేరే కాలేజీలో చేరుతానంటే.. ముందుగా ఒప్పుకున్న ప్రకారం మరో 35వేలు కట్టి తీసుకెళ్లాలంటూ యాజమాన్యం షరతు పెట్టింది.
దీంతో సదరు విద్యార్థి గట్టిగా వాదించడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న ఫీజుల వ్యవహారం గురించి మొత్తం హై అథారిటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో చివరకు సర్టిఫికెట్లు ఇచ్చినట్టు తెలుస్తున్నది. అయినా సదరు విద్యార్థి అన్ని ఆధారాలతో హై అథారిటీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇది ఒకరిద్దరి కథ మాత్రమే కాదు, ఎంతో మంది విద్యార్థుల నుంచి ఇలానే వసూలు చేసినట్టు తెలిసింది. సదరు కళాశాల యజమాన్యాలు చేస్తున్న దందాపై ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, హై అథారిటీకి లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అలాగే ఉన్నత విద్యామండలి, ఫీజు రెగ్యులరేటరీ కమిటీలు ఎలా స్పందిస్తాయో చూడాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి వారీగా ట్యూషన్ ఫీజు చెల్లించిన వివరాలపై ఆరా తీస్తే.. సదరు యజమాన్యాల మొత్తం బాగోతం బయటకు వస్తుందని విద్యావేత్తలు చెబుతున్నారు. మేనేజ్మెంట్ కోటా కింద ఇష్టానుసారం డొనేషన్లు వసూలు చేస్తున్న సదరు యాజమాన్యాలు, ట్యూషన్ ఫీజుల వసూలు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.