Interviews | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 14: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలో సిబ్బంది నియామకానికి శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. రాజన్న ఆలయానికి సంబంధించిన వేములవాడ సమీపంలోని తిప్పాపూర్ గోశాలలో సిబ్బంది నియమాకానికి ఇటీవల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానించారు.
ఈ పోస్టులకు దాదాపు 250 మంది దరఖాస్తు చేసుకోగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంటర్వ్యూలు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ అధికారులు కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్హత, పని అనుభవం తదితర వివరాలను అభ్యర్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు. 40 మందిని ఎంపిక చేసి త్వరలో వారికి నియామక పత్రాలు అందజేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. నూతన సిబ్బంది నియామకంతో గోశాలలో కోడెల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత తదితర సమస్యలు పరిష్కారం కానున్నాయని వివరించారు.