Self-help groups | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 19 : రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పేదోటి చేసేది మరోటి అన్నట్లుగా పరిపాలన సాగిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా స్వావలంభనతోనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే మాటలను కాంగ్రెస్ నేతలు పదే పదే వల్లే వేస్తుండగా, ఆచరణలో పెట్టడం లేదనే వ్యాఖ్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటం దేవుడెరుగు, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు మరణిస్తే వారి కుటుంబాలకు పంపిణీ చేయాల్సిన బీమా సొమ్మైనా సకాలంలో అందించటం లేదనే ఆరోపణలు పెరుగుతున్నాయి.
ఆపదకాలంలో ఆదుకునేందుకు అందించే ఈసొమ్ము కోసం కళ్ళలో వత్తులేసుకుని చూస్తున్నా, అందటం లేదనే అసంతృప్తి ఆయా కుటుంబాల్లోని సభ్యుల నుంచి వ్యక్తమవుతోంది. జిల్లాలో 19,909 స్వయం సహాయక సంఘాలుండగా, వీటిలో 1.50లక్షల పైచిలుకు మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరిలో 1.23 లక్షల మంది దాకా రుణాలు తీసుకోగా, గత ఏడాదిన్నర క్రితం నుంచి జిల్లాలో ఇప్పటి వరకు 200 మందికి పైగా మహిళలు మరణించారు. వీరి కుటుంబాలకు ఇప్పటికీ బీమా సొమ్ము అందలేదని తెలుస్తోంది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరి, రుణాలు తీసుకున్న మహిళలకు రుణ బీమా పథకం ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తారు.
ఈ పథకంలో చేరిన మహిళలు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షలు, సాధారణ మరణమైతే రూ.2లక్షలు చెల్లిస్తారు. తీసుకున్న రుణంలో చెల్లించింది పోను మిగతా రుణ మొత్తం మినహాయించుకుని, మిగిలిన సొమ్ము మరణించిన మహిళ కుటుంబ సభ్యులకు అందజేస్తారు. పదిహేను రోజుల్లోపే వారి కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ చేయాల్సి ఉండగా, అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది పట్టింపులేని తనం వెరసి క్షేత్రస్థాయి విచారణ కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదని ఆ కుటుంబాలు మండిపడుతున్నాయి. మరణించిన మహిళల కుటుంబాలో అత్యదిక శాతం నిరుపేద.
దిగువ మధ్య తరగతికి చెందినవారే ఉండగా. ప్రభుత్వం అందజేసే బీమా సొమ్ము కోసం వారంతా వేచి చూస్తున్నారు. ఈమొత్తం అందితే వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా తమ ఖర్చులకు చేదోడవుతుందనే ఆశతో మృతుల కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ పథకంపై గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు అంతగా అవగాహన లేకపోవటంతో, మరణించిన వారి కుటుంబ సభ్యులు బీమా సొమ్ము కోసం ఇప్పటికీ ధరఖాస్తులు చేసుకోని వారు అనేక మంది ఉన్నట్లు తెలుస్తోంది.
కనీసం ధరఖాస్తులు చేసుకున్న వారికైనా సకాలంలో అందించాలనే నిబద్ధత సంబంధిత యంత్రాంగంలో కొరవడటంతో బీమా సొమ్ము అందటం గగనకుసుమంగా మారుతోందనే ఆవేదన ఆయా కుటుంబాల్లో వ్యక్తమవుతోంది. బీమా సొమ్ము పంపిణీలో జరుగుతున్న జాప్యంపై గతంలో ఉన్నతాధికారుల దృష్టికి రాగా, ప్రత్యేకంగా సమీక్షించి వెంటనే అందజేయాలని ఆదేశించినా, సదరు శాఖ ఉద్యోగులు నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తుండటంతోనే జాప్యం కలుగుతోందని తెలుస్తోంది.
దీనిపై సంబంధితాధికారులను ఆరా తీయగా బీమా సొమ్ము పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే బీమా సొమ్ము అందజేసేలా చర్యలు చేపట్టాలనే డిమాండ్ ఆయా కుటుంబాల నుంచి వస్తోంది.