Dharmaram | ధర్మారం, సెప్టెంబర్ 27 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామ సమాఖ్య భవనంలో ఆదివారం సెర్ప్ ఆధ్వర్యంలో నిరక్షరాస్య మహిళలకు పరీక్ష నిర్వహించారు. దీనికి ధర్మారం సర్పంచ్ దాగేటి రాజేశ్వరీ హాజరై పరీక్ష రాశారు. మండల వ్యాప్తంగా మహిళ సంఘ సభ్యులు మొత్తం 5,608 మంది ఉన్నారు. ఇందులో చదువురాని మహిళా సభ్యులకు ‘అమ్మకు అక్షరమాల’ పుస్తకం ద్వారా సెర్ప్ ద్వారా చదువు నేర్పించారు. అనంతరం మార్చి మాసంలో నిర్వహించిన మొదటి విడత పరీక్ష గత మార్చి మాసంలో నిర్వహించారు.
కాగా 3,099 మహిళా సభ్యులు హాజరై పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. అనంతరం ఆదివారం రెండో విడతలో మిగతా 2,670 మంది మహిళలు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో పరీక్ష రాశారు. ఇట్టి ఉల్లాస్ పరీక్షకు స్థానిక సర్పంచి దాగేటి రాజేశ్వరీ హాజరై మహిళలతో కలిసి ధర్మారంలోని గ్రామ సమైక్య భవనంలో పరీక్ష రాశారు. పరీక్ష రాసిన మహిళలందరికీ ఉత్తీర్ణత ధ్రువపత్రం అందజేయనున్నట్లు సెర్ప్ సీసీ గుజ్జేటి స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీసీలు, ఆయా గ్రామాల వీవో అధ్యక్షుడు పాల్గొన్నారు.