Singareni | రామగిరి, మే 17: సింగరేణి బ్లాస్టింగ్ విధ్వంసంతో నాగేపల్లిలో దెబ్బతిన్న ఇండ్లను పూర్తి స్థాయిలో సర్వే చేసి మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, రైతుబంధు అధ్యక్షుడు మేదరవేని కుమార్‌యాదవ్, తాజామాజీ సర్పంచ్ కొండవేన ఓదెలులు డిమాండ్ చేశారు.
శనివారం దెబ్బతిన్న ఇండ్లను, సింగరేణి మరమ్మత్తు చేపట్టిన ఇండ్లను పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. బ్లాస్టింగ్ విధ్వంసం జరిగిన రోజున బాధితులకు న్యాయం జరుగాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా రోడ్డెక్కి దిగ్బంధం చేస్తే పోలీసు అధికారులు సింగరేణి ఆర్జీ-3 జీఎం సుధాకర్‌రావును తీసుకువచ్చి హామీ ఇప్పించారని తెలిపారు. అందులో భాగంగా తప్పంతా తమదే అని క్షమించమని కోరడంతో పాటు దెబ్బతిన్న ఇండ్లన్నింటిరీ మరమ్మత్తు చేపడుతామని, ఒక రేకు పగిలితే మొత్తం రేకులు కొత్తవి వేసి మరమ్మత్తు చేయడంతో పాటు దెబ్బతిన్న వస్తువులను కొత్తవి కొనిస్తామని మాటిచ్చారన్నారు.
కానీ ప్రస్తుతం మరమ్మతు పనులు నాసిరకండా ఉంటున్నాయని, దెబ్బతిన్న వాటి స్థానంలో మాత్రమే కొత్తవి వేస్తామని కొర్రీలు పెడుతున్నారని వారు ఆరోపించారు. పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులను సైతం కొత్తవి కాకుండా రిపేర్ చేయిస్తామంటున్నారని మాట తప్పితే కోర్టుకీడుస్తామని హెచ్చరించారు. జీఎం హామీ ఇచ్చిన రోజున నాగేపల్లి గ్రామ ప్రజలు మంచితనంతో జీఎంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయాలని కోరలేదని, కానీ జీఎం మాత్రం మాట నిలబెట్టుకోకుండా బేరాలు అడుతున్నారని, ఇలాగే పూర్తి స్థాయిలో నాణ్యతగా మరమ్మతులు చేపట్టడంతో పాటు వస్తువులు కొత్తవి కొనివ్వకపోతే సింగరేణిపై కోర్టులో ప్రైవేట్ కేసు వేసి క్రిమినల్ కేసు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.
అదేవిధంగా కాలువ మళ్లింపు పనులను తక్షణం నిలిపివేయాలని కెనాల్ పనుల వల్ల సీ బ్లాక్ నివసిస్తున్న ప్రజలకు ప్రమాదం ఉంది కాబట్టి సింగరేణి సీ బ్లాక్‌ను సందర్శించి సీ బ్లాక్ ప్రజలకు పునరావాసం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బాధ్యతంతా నాదే అని వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన ఏసీపీ రమేష్ ఈ పనులన్నీ పూర్తయ్యే వరకు తన బాధ్యతను గుర్తుంచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సెంటినరీకాలనీ పట్టణ అధ్యక్షుడు కాపురవేన భాస్కర్, నాయకులు వేగోలపు శ్రీనివాస్, చిట్టెంపల్లి అనిల్, కొండవేన ప్రభాకర్, కొండవేన సుధాకర్, పోలు సంతోష్, చంటి, సంతు, మల్యాల సారయ్య, మల్యాల బాపు, కలవేన వెంకటేష్, మల్యాల శ్రీనివాస్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.