Jagityal | జగిత్యాల, మే25 : తల్లిదండ్రులను పోషించక నిరాధరిస్తున్న కొడుకులకు, వారి కోడళ్లకు తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు కౌన్సిలింగ్ చేయడంతో తాము తమ తల్లిదండ్రులను పోషిస్తూ, బాగోగులుచేసుకోవడానికి సమ్మతించి ఒప్పంద పత్రం రాసిచ్చారు.
జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రంకు జిల్లాలోని జగిత్యాల పట్టణం, మేడిపల్లి, కథలపూర్, గొల్లపల్లి, వెల్గటూర్, మల్యాల మండలాలకు చెందిన ఆ కొడుకులను, కోడళ్లను ఆ వృద్ధ తల్లిదండ్రుల అభ్యర్థనపై పిలిపించి వయోవృద్ధుల చట్టంపై హరి అశోక్ కుమార్ ఆదివారం అవగాహన కల్పించారు. ఈ కౌన్సెలింగ్ లో జగిత్యాల పట్టణానికి చెందిన వరంగల్ లో పనిచేస్తున్న కారుణ్య నియామక ఉద్యోగి గోనెల ప్రకాష్, నిజామాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న చెందిన కుంటమల్ల సురేష్‌ల, కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెంది జగిత్యాల పట్టణంలో వృత్తి పనులు చేసుకుంటూ జీవిస్తున్న కంటే ప్రభాకర్, మేడిపల్లి మండల కేంద్రానికి చెంది జగిత్యాలలో నివసిస్తున్న లక్కమల్ల వెంకటేష్, వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన అరిగళ్ల మురళి ఉన్నారు.
కొడుకులు తల్లిదండ్రులను పోషించక నిరాదరణకు గురిచేస్తే రెవెన్యూ డివిజనల్ అధికారి అయిన వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ 6 మాసాలకు పైగా జైలు శిక్ష, జరిమానా విధించే వీలు ఆ చట్టంలో ఉందని, మాయ మాటలతో, బెదిరింపులతో వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నా అట్టి ఆస్తులు తిరిగి ఆ తల్లిదండ్రుల పేరిట మార్పిడి చేసే అధికారం కలెక్టర్ కు ఉందని, కారుణ్య నియామక ఉద్యోగులు తమ తల్లిని, కుటుంబ సభ్యులను నిరాదరిస్తే వారు చేసే ఉద్యోగం నుంచి నియామక ఉన్నతాధికారి వారిని ఉద్యోగం నుంచి సస్పెన్షన్, ఆ తర్వాత ఉద్యోగం నుండి తొలగించే అధికారం ఉందని కౌన్సిలింగ్ చేయడంతో ఆ కొడుకులు, కోడళ్ళు సమ్మతించి ఒప్పంద పత్రాలు రాసిచ్చారు. జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తో పాటు ప్రతినిధులు గౌరిశెట్టి విశ్వనాథం, వెల్ముల ప్రకాష్ రావు, బైరి రాధ తదితరులు పాల్గొన్నారు.