నగరాలు, పట్టణాలకు వెళ్లలేక, ప్రై‘వేటు’లో వేలకు వేలు చెల్లించలేని పేదలకు హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం భరోసానిస్తున్నది. కార్పొరేట్‌కు దీటుగా 24 గంటల పాటు సేవలందిస్తున్నది. ఈ వంద పడకల దవాఖానలో మెరుగైన వైద్యం అందుతుండడంతో రోజురోజుకూ తాకిడి ఎక్కువవుతున్నది. ప్రత్యేకంగా గైనిక్ వైద్యులు ఉండడంతో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. రిస్క్, హై రిస్క్ డెలివరీ కేసులను అవలీలగా చేస్తూ తల్లీబిడ్డలను చల్లగా చూస్తున్నది. గడిచిన నాలుగు నెలల్లో 585 ప్రసవాలు జరుగగా, అందులో 56 శాతం నార్మల్ డెలివరీలు చేసి సత్ఫలితాలు సాధిస్తున్నది.
హుజూరాబాద్ రూరల్, జూలై 19: ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో హుజూరాబాద్ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. వైద్యులు అందుబాటులో ఉండడంతోపాటు ప్రైవేటుకు దీటుగా సేవలందిస్తుండడంతో రోజురోజుకూ రోగుల సంఖ్యతోపాటు ప్రసవాల సంఖ్య కూడా పెరుగుతున్నది. గడిచిన నాలుగు నెలల నుంచి నార్మల్ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. రెండవ కాన్పు మాత్రం తప్పనిసరిగా ఆపరేషన్ చేయవల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
24 గంటల వైద్యుల పర్యవేక్షణ
హుజూరాబాద్ వంద పడకల దవాఖాన కావడంతో 24 గంటలూ వైద్యుల పర్యవేక్షణ ఉంటున్నది. ఎమర్జెన్సీ విభాగంగలో ఇద్దరు వైద్యులు, ప్రసవాలకు గైనిక్ విభాగంలో నలుగురు వైద్యులు అందుబాటులో ఉండి ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి కాన్పు నార్మల్కు ప్రయత్నం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే అపరేషన్ చేస్తున్నారు. రిస్కు నుంచి హై రిస్కు రోగులను కూడా వరంగల్, కరీంనగర్ దవాఖానలకు తరలించకుండా ఇక్కడే వైద్య సేవలందిస్తున్నారు. వీరితోపాటు దవాఖానలో ఇద్దరు సర్జన్లు, ముగ్గురు పిల్లల వైద్య నిపుణులు, ఇద్దరు ఆర్థో, ముగ్గురు అనస్తీషియన్ వైద్యులు సేవలందిస్తున్నారు. ఏప్రిల్‌లో 153, మేలో 179, జూన్‌లో 172, జూలైలో 20 రోజుల్లో 81 మంది గర్భిణులకు ప్రసవాలు చేశారు. అందులో 56 శాతం నార్మల్ డెలివరీలేనని వైద్యులు చెబుతున్నారు.
నార్మల్ డెలివరీ అయింది
నా భర్త హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తడు. నాలుగు నెలలు అక్కడ ప్రైవేట్ దవాఖానలో పరీక్షలు చేయించుకున్న. చాలా డబ్బు ఖర్చయింది. డెలివరీ కావాలంటే లక్ష దాటుతుందన్నరు. ఐదో నెల నుంచి మా అమ్మ వాళ్ల ఊరు సిర్సపల్లికి వచ్చి సర్కారు దవాఖాన్లనే ప్రతి నెలా టెస్టులు చేయించుకున్న. నార్మల్ డెలివరీ అయింది. కొడుకు పుట్టిండు. సంతోషంగా ఉంది.
– దొంత కోమల, సిర్సపల్లి (హుజూరాబాద్ మండలం)
కేసీఆర్ కిట్టు ఇచ్చిన్రు
మాది మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి. నాకు రెండో కాన్పు. కొడుకు పుట్టిండు. డాక్టర్లు, నర్సులు అందరు మంచిగ జూసుకున్నరు. బాబు కోసం నాకు కేసీఆర్ కిట్టు గూడ ఇచ్చిండ్రు. ఇది ప్రభుత్వ దావఖాన లేక్కలేదు. పెద్ద హాస్పిటల్ లెక్క ఉన్నది. కొంచెం దూరమైనా ఇక్కడికి రావాలనుకున్న.
– అబ్బు రాణీ, పర్లపెల్లి
గర్భిణుల చెంతకే వైద్య సేవలు
గర్భిణులు కాన్పు సమయానికి దవాఖానకు వచ్చేలా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు సేవలందిస్తున్నారు. గర్భిణిగా నమోదైనప్పటి నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి ప్రతి నెల పరీక్షలకు దవాఖానకు తీసుకువస్తారు. ఈ రిజిస్టర్లో నమోదైన వివరాల ఆధారంగా డెలివరీ ఎప్పుడవుతుందో గుర్తించి 104 వాహనంలో హాస్పిటల్‌కు తీసుకువచ్చి ప్రసవం చేయించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందించి మళ్లీ అదే వాహనంలో ఇంటికి పంపుతున్నారు.
మెకాళ్ల కీళ్ల మార్పిడి వైద్యసేవలు
కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మాత్రమే నిర్వహించే మోకాళ్ల కీల్ల మార్పిడి చికిత్స ఈ దవాఖానలో అందిస్తున్నారు. ఇవే కాకుండా డయాలసిస్ సెంటర్(రక్త శుద్ధి) వార్డు ఏర్పాటు చేసి రోజుకు 20 మంది రోగులకు రక్త శుద్ధి చేస్తున్నారు. జ్వరాలు, ఇతరత్రా రోగులకు ఇన్‌పేషెంట్ సౌకర్యాలు కూడా కల్పించారు. ప్రతి రోజు వంద నుంచి 200 మంది గర్భిణులకు ఓపీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ల్యాబ్, ఎక్క్‌రే, ఈసీజీ సౌకర్యాలు కూడా ఉన్నాయి.
సేవలు సద్వినియోగం చేసుకోవాలి
అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నాం. 24 గంటల పాటు పర్యవేక్షణ చేస్తున్నాం. అడ్మిట్ అయిన పేషెంట్లకు భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. అన్ని రకాల పేషేంట్లకు చికిత్స చేస్తున్నాం. సర్కారు దవాఖాన సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ సుధాకర్‌రావు, అర్‌ఎంవో
నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యం అందిస్తున్నాం. వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. పాము, కుక్క, కోతి, తేలు కాటుకు కూడా ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. నాటు వైద్యం వద్దకు వెళ్లకూడదు. బాలింతలకు ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేశాం.
– డాక్టర్ రాజేందర్, దవాఖాన సూపరింటెండెంట్