అది ప్రభుత్వ స్థలం. మొన్నటిదాకా గుట్టబోరు ప్రాంతం. చెట్లు, పుట్టలతో అధ్వానంగా కనిపించే ఏరియా. అయితే, ఆ జాగను ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇవ్వాలని అధికారులు కొద్దిరోజుల క్రితమే చదును చేసే పనులకు శ్రీకారం చుట్టగా, కొందరు కొత్త కథ మొదలు పెట్టారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నవారికి ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామని ప్రకటించడంతో పేదలు నమ్మారు. తండోపతండాలుగా కదిలివచ్చి, డేరాలు వేయడం మొదలు పెట్టారు.
చూస్తుండగానే విషయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పాకడంతో డేరాలు పదుల సంఖ్యను దాటి వందకు, రెండు నెలల వ్యవధిలోనే వేలకు చేరడమేకాదు.. అక్కడే నివాసం ఉంటున్న వింత పరిస్థితి కనిపిస్తున్నది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా, మరోవైపు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సోమవారం 5 వేల మందితో జగిత్యాల కలెక్టరేట్‌కు ర్యాలీ తీసేందుకు సీపీఎం నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జగిత్యాల, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారు పరిధిలో 437/112/2 సర్వే నంబర్లో దాదాపు 220 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే, ఈ సర్వే నంబర్‌తో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో సైతం ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇవన్నీ గుట్ట బోర్లే. అయితే, కొద్ది నెలల క్రితం గుట్ట బోర్లను చదును చేసి, వాటిని ప్రభుత్వ కార్యకలాపాలతో పా టు, కొన్ని కార్యాలయాలకు ఇవ్వాలన్న ఆలోచనను ప్రభుత్వం చేసి ంది.
ఈ క్రమంలో గుట్టబోర్లను చదును చేసే కార్యక్రమం ప్రారంభమైంది. విషయం తెలుసుకున్న వెంటనే సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యం లో ఇండ్ల పట్టాలు ఇప్పిస్తామని, ప్రజలు కలిసివచ్చి తమ తో పాటు ఉద్యమిస్తే ఇది సాధ్యమవుతుందని ప్రకటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రాతినిధ్యం వహించి పేదలకు ఇండ్ల స్థలాన్ని ఇప్పించేలా చూస్తామని, అవసరమైతే పోరాటం చేస్తామన్నారు.
సీపీఎం నాయకుల ప్రకటనతో రెండు నెలల క్రితమే గ్రామ శివారులోని గుట్ట బోర్లకు షెడ్లు వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇండ్ల స్థలాలు వస్తాయన్న విషయం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు క్రమంగా పాకిపోయింది. దీంతో పదుల సంఖ్యలో ప్రజలు నర్సింగాపూర్ శివారుకు రావడం మొదలైంది. వచ్చిన మహిళా సంఘ సభ్యుల్లో పదకొండు మందికి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పడ్డ పది గ్రూప్‌లతో ఒక పెద్ద గ్రూ ప్ను ఏర్పాటు చేశారు. ‘ఆర్డీవో జగిత్యాల పేరిట’ పేరు, తండ్రిపేరు, ఆధార్‌కార్డు, చిరునామాల వివరాలు, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో దరఖాస్తు ఫారాలను రూపొందించి, మహిళా సంఘ సభ్యులకు అందజేశారు. అయితే, దరఖాస్తు ఫారాలు తీసుకొన్న మహిళలకు గుట్టబోరుకు షెడ్డు వేసుకొని, నివాసం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇండ్ల పట్టాల విషయం దావానంలా వ్యాపించడంతో 15 రోజుల వ్యవధిలోనే వేల సంఖ్యలో మహిళలు నర్సింగాపూర్‌కు శివారులోని ఈ స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. అయితే, ని త్యం ఇక్కడే ఉండాలని, అవసరమైతే ప్రభుత్వంతోనూ, అధికారులతోనూ పోరాటం చేసేందుకు సిద్ధపడాలని సదరు నాయకులు తెలియజేయడంతో అక్కడే ఉంటున్నారు. ఇంకా షెడ్డు వేసుకోలేని వారు అవసరమైతే స్థలంలో చీరలు చుట్టాలని చెప్పడంతో, పెద్ద సంఖ్యలో చీర లు సైతం చుట్టారు.
ముఖ్యంగా బెజ్జంకి, గుండి, గోపాల్రావుపేట, ధ ర్మారం, రామడుగు, సిరిసిల్ల, చందుర్తి ఇలా అనేక ప్రాంతాల నుంచి మహిళలు, ప్రజలు నర్సింగాపూర్ గుట్ట బోర్ల వద్దకు చేరుకొ ని ఇక్కడే 15 రోజులుగా ఉంటుండడం విశేషం. ఇక మహిళా గ్రూపుల సభ్యు లు మొత్తం ఇక్కడే నివాసం ఉండాలని, పొద్దున, సాయం త్రం హాజ రు తీసుకునేందుకు వీలుగా హాజరుపట్టి ఏర్పాటు చేయాలని చెబుతుండడంతో మహిళ సంఘాల వాళ్లు అటెండెన్స్ రిజిస్టర్‌ను మెయింటెన్ చేస్తున్నారు. రోజూ రెండుసార్లు హాజరు తీసుకుంటున్నారు.
నర్సింగాపూర్ గుట్టబోరు ప్రాంతంలో జన సామర్థ్యం పెరగడంతో ఇక్కడే తాత్కాలిక హోటల్స్ వెలిశాయి. వాటితో పాటు జిరాక్స్ సెంటర్, ఫొటో స్టూడియోలతో పాటు, చిరుతిండ్లను అమ్మే దుకాణాలు తాత్కాలికంగా ఏర్పాటు చేసి, వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా అటెండెన్స్ తీసుకుంటుండడంతో, అటెండెన్స్ రిజిస్టర్ బుక్కులు అమ్మే దుకాణాలు కూడా వెలువడం విశేషం.
కాగా, ఈ విషయమై సీపీఎం నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అత్యవసరాలని, నిరుపేదలకు కనీసం 120 గజాల ఇండ్ల స్థలాలు ఇప్పించడమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందంటున్నారు. నర్సింగాపూర్ శివారులో దాదాపు 800 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలన్న మంచి లక్ష్యంతో తాము ముందుకు వెళ్తున్నామన్నారు. రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇవ్వాలని కోరామని, వారి నుంచి సరైన సమాధానం లేదని వారు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని వివరించారు. దాదాపు ఐదువేల మందితో ర్యాలీగా సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌కు వెళ్లి ప్రజావాణిలో దరఖాస్తు చేస్తామని చెప్పారు.
నర్సింగాపూర్ శివారులోని 437/112/2 సర్వే నంబర్ భూమి ప్రభుత్వానికి చెందినదని, ఆ భూమిలో చొరబడి, షెడ్లు వేసుకోవాలని సూచించిన వారిపై కేసు నమోదు చేశామని జగిత్యాల రూరల్ సీఐ ఆరిఫ్ అలీఖాన్ పేర్కొన్నారు. నర్సింగాపూర్ ప్రభుత్వభూమిలో ప్రజలు షెడ్లు వేసుకునే విషయంలో తమకు జగిత్యాల రూరల్ తహసీల్దార్ ఫిర్యాదు చేశారని, ఈ క్రమంలో బాధ్యులైన కొందరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎవరో ఏదో చెప్పారని నమ్మి షెడ్లు వేసుకోవద్దని, ఆ ఆలోచనను విరమించుకోవాలని, లేదంటే షెడ్లు వేసుకున్నవారిపై సైతం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.