Manakondur | మానకొండూరు, సెప్టెంబర్ 1 : పూజ గదిలో వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న సామాగ్రి, దుస్తులు, నగదు పూర్తిగా దగ్ధమయ్యాయయి. ఈ సంఘటన మంగళవారం మానకొండూరులో చోటుచేసుకుంది. ఫైర్ సిబ్బంది, భాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన కోండ్ర శంకరమ్మ, ఇరుగురాళ్ల పోచయ్య ఇంటిలో అద్దెకు ఉంటోంది. ఉదయం పూజగదిలో దీపం వెలింగించి కరీంనగర్ పనికి వెళ్లింది.
ఈ క్రమంలో దీపం ప్రమాదవశాత్తు కిందపడి పోవడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లోని దుస్తులు, వంట సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. శంకరమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులకోసం తీసుకువచ్చి ఇంట్లో దాచిపెట్టిన రూ.రెండు లక్షల నగదు కూడా ప్రమాదంలో కాలిబూడిదైంది. ఘటనా స్థలానికి మానకొండూర్, కరీంనగర్ అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇల్లు పాత కట్టడం కావడంతో పైకప్పుకు ఉన్న దూలాలు, కర్రకు మంటలు వేగంగా వ్యాపించడంతో భారీ నష్టం వాటిల్లింది. బాధిత కుటుంబ ధీనస్థితిని చూసి మానకొండూర్ అగ్నిమాపక సిబ్బంది రూ.4వేల నగదు ఆర్థిక సహాయం అంద చేశారు. ప్రమాద స్థలాన్ని మానకొండూర్ సీఐ శ్రీలత పరిశీలించారు.