నాడు పల్లెల్లో ఓ వెలుగు వెలిగిన పేదోడి దుప్పటి గొంగడి, గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటింది. వాన, చలి, ఎండ.. కాలమేదైనా రక్షణ కవచంలా పనిచేసిన ఈ నల్ల కంబలికి గ్రామాల్లో ఆదరణ చెక్కు చెదరలేదు. మార్కెట్లో నాణ్యమైన గొంగడి ధర రూ.వెయ్యికి పైనే పలుకుతున్నది.
– ఓదెల, డిసెంబర్ 10
ఓదెల, డిసెంబర్ 10: పూర్వకాలం నుంచి గొంగడి వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతున్నది. మేడిన్ తెలంగాణగా ముద్రపడ్డ ఈ వస్త్రం, ఆది నుంచీ ప్రత్యేకంగా నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో కంబలిగా పిలువబడింది. ఇది ఎండాకాలం కప్పుకుంటే చల్లదనం, చలికాలం వెచ్చదనం ఇచ్చేది. వానాకాలం తడవకుంట ఉండేది. మూడు కాలల్లోనూ గ్రామీణులకు అండగా నిలిచింది.
ఒకప్పుడు వేలాది కుర్మ కుటుంబాలు ఈ గొంగడి నేతపై ఆధారపడి జీవించేవి. అప్పట్లో అంతా దక్కన్ గొర్రెలుగా పిలుచుకునే మన నల్లగొర్లను పెంచుకునే వాళ్లు. కేవలం ఉన్ని కోసమే ఎక్కువగా సాదేవాళ్లు. దాంతో నాణ్యమైన కంబల్లు తయారయ్యేవి. నల్లగొంగడి, నీడ గొంగడి, పిల్లల గొంగడి పేర్లతో రకరకాల గొంగళ్లు నేసి, అమ్మేవాళ్లు. మన జిల్లావే కాకుండా ఇతర ప్రాంతాల్లో తయారైన చెలికేడు గొంగడి, చంత్రంజి గొంగడి, కలర్ గొంగళ్లకు కూడా ఆదరణ ఉండేది.
తెలంగాణ అంతటా ప్రధాన అంగళ్లలో గొంగళ్ల వ్యాపారం జోరుగా సాగేది. జిల్లా గొర్ల నుంచి తీసిన ఉన్నికి ఇతర రాష్ర్టాల్లో కూడా మంచి గిరాకీ ఉండేది. ముఖ్యంగా బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి వ్యాపారులు వచ్చి, ఇక్కడి ఉన్ని కొనుక్కెళ్లేవాళ్లు. గొర్ల మందల వద్దే ఉన్ని కత్తిరించుకుని క్వింటాళ్ల లెక్కన తూకం వేసుకుని వెళ్లేవాళ్లు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోనూ ఆదరణ ఉండేది. అలాగే విదేశాలకు సైతం మన గొంగళ్ల ఎగుమతి జరిగింది. కానీ కాలక్రమేణా 20శతాబ్ధ ఆరంభంలో రెడీమెడ్ వస్త్ర విప్లవంతో వన్నె తగ్గిపోయింది. మెత్తని బ్లాంకెట్లు, చెద్దర్లతో రాకతో ఆదరణ తగ్గి, నేటి తరానికి అసలు గొంగడి అంటే తెలియకుండా పోయింది. అలనాటి పురాతన వస్త్రం పనితీరుకు నేటి ఏ వస్త్రం సరితూగకపోవడంతో ప్రస్తుత కాలంలో మళ్లీ ఆదరణ పెరుగుతున్నది. పేద, మధ్య, ధనిక కుటుంబాలు సైతం నామూషీకి వెళ్లకుండా కొనుక్కుంటుండడంతో మార్కెట్లో భలే గిరాకీ పలుకుతున్నది. రూ.వెయ్యి పెట్టనిదే నాణ్యమైన కంబలి దొరికే పరిస్థితే లేకుండా పోయింది.
మెజార్టీ కులస్తులు గొంగళ్ల నేతను పక్కకు పడేసినా ఓదెల మండలం కనగర్తికి చెందిన మొగిలి కనకయ్య అనే వృద్ధుడు ఇప్పటికీ కంబళ్లను నమ్ముకునే బతుకుతున్నాడు. శీతాకాలం వచ్చిందంటే చాలు గొంగళ్లను తయారు చేస్తూ, ఎనిమిది పదుల వయస్సులోనూ మోపెడ్‌పై ఊరూరా తిరుగుతూ విక్రయిస్తున్నాడు. ఒక్కోటి వెయ్యి దాకా విక్రయిస్తున్నట్లు చెబుతున్నాడు. గొంగళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోవడంతో కనుకయ్య పేరు కాస్త గొంగళ్ల కనకయ్యగా మారిపోయింది. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో గొంగళ్లకు మంచి గిరాకీ ఉంటుందని చెబుతున్నాడు.