అరుదైన, ఘనమైన చారిత్రక వారసత్వాన్ని కలిగిన జిల్లా జగిత్యాల. గోదావరినది పరీవాహకంగా అధికంగా ఉండి, మానవ కోటి నాగరికత అభివృద్ధి మూలాలు కలిగిన నేల. తొలి రాతియుగం, మలి రాతియుగం ఆనవాళ్లు, రాకాసి గూళ్లు, పురాతన పునాదులు ఉన్న ప్రాంతం. దక్షిణ భారత దేశాలను సమైక్యం చేసి పరిపాలించిన శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటి లింగాలకు ఆలవాలంగా, అరుదైన కాకతీయుల త్రికుటాలయాలకు, చాళుక్యుల నిర్మాణాలకు కేంద్రంగా, పొలవాస మేడరాజులు పాలించిన ఈ క్షేత్రంలో చారిత్రక సంపద నిర్లక్ష్యపు నీడలో మగ్గుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధుల పట్టింపులేక ఆరుబయటే ఎండకు ఎండుతూ, వానకు తడిసిపోతున్నది. పురావస్తు అవశేషాలను నిర్లక్ష్యం చేయడంతో కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోగా, మరికొన్నింటిని కరీంనగర్, హైదరాబాద్ చారిత్రక, పురావస్తు ప్రదర్శన శాలలకు యంత్రాంగం తరలించింది. అయితే జగిత్యాల జిల్లాగా ఏర్పడ్డ నేపథ్యంలో గతంలో ఇక్కడి నుంచి వివిధ ప్రదర్శన శాలలకు తీసుకెళ్లి అరుదైన వస్తువులు, నాణేలను తిరిగి తెప్పించాలని, జిల్లాలోని చారిత్రక సంపదను కాపాడాలని డిమాండ్ వినిపిస్తున్నది.
జగిత్యాల, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): జగిత్యాల చారిత్రక సంపద 50 ఏండ్లుగా ఇతర ప్రాంతాలు, పట్టణాలకు, ప్రదర్శన క్షేత్రాలకు తరలిపోయింది. అరుదైన శిల్ప, విగ్రహాలు, నాణేలు హైదరాబాద్ పురావస్తు ప్రదర్శనశాలకు, లేదంటే కరీంనగర్‌లోని ప్రదర్శన క్షేత్రానికి వెళ్లిపోయింది. శాతవాహనుల రాజధాని అయిన కోటిలింగాలలో అనేక విలువైన పురావస్తు ఆధారాలు బయటపడ్డాయి. 1978 నుంచి 1983 వరకు పురావస్తు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపగా, అనేక వెండి, పంచ్‌మార్క్‌డ్ నాణేలు లభ్యమయ్యాయి. శాతవాహనుల కంటే పూర్వం పరిపాలించిన స్థానిక రాజులైన రాణో నారాయ, రాణో సమగోప, రాణో గోభద, రాణో కనయసి, నాణేలు బయటపడ్డాయి. ఈ నాణేలపై ప్రాకృత భాష కనిపిస్తుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని హైదరాబాద్ పురావస్తు ప్రదర్శన శాలకు తరలించారు. అలాగే శాతవాహనుల తొలి చక్రవర్తిగా గుర్తింపు పొందిన చిముఖ సాద్వాహన నాణేలు సైతం ఇక్కడ బయటపడ్డాయి.
ఎనిమిది చిముకుడి నాణేలు లభ్యమయ్యాయి. ఈ నాణేలతో కోటిలింగాల ప్రాంతమే తొలి రాజధాని అన్న విషయం స్పష్టమైంది. అలాగే వందలాది బావులు, వేలాది పూసలు, మట్టి పాత్రలు, గొడ్డల్లు, పాత్రలు, మట్టిపాత్రలు, ఇండ్ల వరుసలు.. ఇలా అనేకం బయటపడ్డాయి. అందులో 59 బంగారు పూసల హారం అత్యంత విశిష్టమైనది. ఆ పూసల్లో కొన్ని తాబేలు, నందిపాదు, కప్ప, వజ్రం తదితర ఆకారాల్లో ఉండడం గమనార్హం. అలాంటి అరుదైన బంగారు హారాన్ని చూసే అవకాశం జిల్లా ప్రజలకు ఇంత వరకు కలగలేదు. అసలు అలాంటి ఒక హారం లభించిందన్న విషయమే ఎవరికీ తెలియదు. అలాగే మౌర్యుల కంటే ముందు కాలానికి చెందిన 418 పంచ్మార్కుడ్ నాణేలు కోటిలింగాలలో లభ్యమయ్యాయి. వీటిని హైదరాబాద్ ప్రదర్శన శాలకు తరలించారు. ఇంకా గ్రామ సమీపంలోని గోదావరి నది తీరంలో వేణుగోపాల స్వామి, కాళియ మర్దన, శేషశయనంపై పవళించిన విష్ణుమూర్తి విగ్రహాలు బయటపడగా, కరీంనగర్ ప్రదర్శన క్షేత్రానికి తరలించారు.
ఇక ధర్మపురి గ్రామానికి సమీపంలోని పాశిగామ్ గ్రామంలోని అత్యంత అరుదైన బౌద్ధస్తూపం దొరికింది. అయితే ఇది తవ్వకాల్లో నేలమట్టమైంది. అనంతర కాలంలో దీన్ని గుర్తించి, పగిలిన ఫలకాలను కరీంనగర్ ప్రదర్శన క్షేత్రానికి తరలించారు. ఆ ఫలకాలతో తాత్కాలికంగా స్తూపాన్ని నిర్మించారు. అది కూడా జగిత్యాలకు రావాల్సిన అవసరం ఉంది. అలాగే గుట్రాజ్‌పల్లిలో జరిగిన తవ్వకాల్లో 30 రోమన్ నాణేలు బయటపడగా, హైదరాబాద్ ప్రదర్శనశాలకు తరలించారు. జిల్లాలోని మరో చారిత్రక కేంద్రమైన పొలవాస సైతం పూర్తిగా నిరాధరణకు గురవుతున్నది. ఇక్కడ అరుదైన విగ్రహాలు అనేకం లభ్యమయ్యాయి. కొలిచాల విశ్వనాథం అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో జైన వర్దమాన మహావీరుడి విగ్రహం బయటపడగా, కరీంనగర్‌కు తరలించారు. రాయికల్‌లోని త్రికూటాలయానికి సంబంధించిన విగ్రహాలు, శిల్పాలు సైతం తీసుకెళ్లారు. మరికొన్ని చోరుల పాలయ్యాయి. ఇక జగిత్యాల ఖిలాలో ఒకనాటి కాలంలో 96 పిరంగులు ఉండగా, ప్రస్తుతం 42 మాత్రమే ఉన్నాయి. ఇక జగిత్యాల తహసీల్ కార్యాలయానికి గతంలో అమర్చబడిన రెండు కంచు పిరంగులు కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి తరలించారు.
ఆరుబయటే సంపద
విలువైన సంపద ఇతర ప్రాంతాలకు, ప్రదర్శన క్షేత్రాలకు తరలించుకువెళ్లగా, మరెన్నో చారిత్రక కట్టడాలు ఆరుబయట ఆలనాపాలన లేకుండా పడి ఉన్నాయి. పొలాసలో రెండు అరుదైన కన్నడ శాసనాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ వద్ద ఉన్న కన్నడ శాసనాన్ని భూమి నుంచి పెకిలించి నిర్లక్ష్యంగా పడేశారు. ఇక పౌలస్తేశ్వర ఆలయంలో వీరగళ్లు శిల్పం నుంచి మొదలుకొని అనేక శిల్పాలు ఆరుబయటే పడి ఉన్నాయి. రాయికల్ మండల కేంద్రంలోని త్రికుటాలయంలో క్రీ.శ 1305 సంవత్సరానికి చెందిన ప్రతాప రుద్రుడి శాసనం తన ఉనికిని కోల్పోయింది. జాబితాపూర్‌లో రోడ్డుపై ఓ చిన్న గద్దెపై అరుదైన అన్నపూర్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాశీలో మాత్రమే అలాంటి అరుదైన అన్నపూర్ణ మాత విగ్రహం ఉందని పురావస్తుశాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోరుట్ల పట్టణంలో మహదేవ ఆలయంలో బాహుబలి, పార్శనాథుడి విగ్రహాలు, వర్దమానుడి విగ్రహా ప్రభా మండలం ఎందుకు పనికిరాకుండా, ఎవరికీ తెలియకుండా రహస్యంగానే ఉండిపోతున్నాయి.
పొలవాసలో జైన తీర్థంకరుల విగ్రహాలు గుట్టపై నిర్లక్ష్యంగా పడేశారు. జగిత్యాల జిల్లా పశ్చిమ చాళుక్యుల కాలానికి చెందిన అనేక గణపతి, నంది విగ్రహాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. రాయికల్ మండలంలోని వస్తాపూర్ గ్రామం అత్యంత ప్రాచీనత కలిగిన గ్రామంగా చరిత్రకారులు గుర్తించారు. ఇక్కడ పాతరాతి యుగానికి సంబంధించిన బృహత్ శిలా సమాధులను గుర్తించారు. అలాగే కట్కాపూర్ గ్రామంలో ఇటీవలి కాలంలో అనేక అరుదైన ప్రాచీన విగ్రహాలు బయటపడ్డాయి. ఉమ శంకరుల విగ్రహం, గణపతి విగ్రహం, వైష్ణవ సాంప్రదాయ విగ్రహాలు ఉన్నాయి. ధర్మపురి మండలం స్థంభంపల్లి గ్రామంలో పరిశోధన నిర్వహిస్తే, బౌద్ధ్ద, జైన ప్రతిమలు, స్తూపాలు లభ్యమయ్యే అవకాశాలున్నాయి. నక్కలపేట గ్రామ శివారులో తీర్థంకరుడి విగ్రహం లభ్యమైంది. అలాగే బైరవుడు, షణ్ముకుడు, నంది, నాగిని విగ్రహాలు వీరభధ్రుడి విగ్రహాలు ఇలా అనేక చారిత్రక అంశాలు కనిపిస్తున్నాయి. పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ముందు, నాయకురాలు నాగమ్మ ఆలయం సమీపంలో విలువైన శిల్పాలు ఇష్టారాజ్యంగా పడేశారు. ఇలా వేలాది విగ్రహాలు, నందులు, నాగిని ప్రతిమలు, అరుదైన శిల్పాలు ఆదరణకు నోచుకోవడం లేదు.
ప్రదర్శన క్షేత్రం కావాలంటున్న జనం
జగిత్యాల జిల్లా కేంద్రంగా మారి ఎనిమిదేండ్లు అవుతోందని, ఇక్కడి చరిత్రను ఇక్కడే ప్రదర్శించాల్సిన అవసరం ఉందని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న జగిత్యాలలో ఇంత వరకు పురావస్తు ప్రదర్శన క్షేత్రం లేకపోవడం, ఇక్కడ బయటపడ్డ సంపద ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన నేపథ్యంలో చారిత్రక వారసత్వ శూన్యత ఆవహించిందని చరిత్రకారులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో పురావస్తు ప్రదర్శన శాలను ఏర్పాటు చేయాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న చారిత్రక స్థావరాలపై పరిశోధన జరిపి, ఇక్కడి చారిత్రక సంపదను పురావస్తు ప్రదర్శన శాలకు తీసుకురావాలంటున్నారు. అలాగే హైదరాబాద్‌లోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పురావస్తు ప్రదర్శన శాలకు, కరీంనగర్‌లోని గాంధీ పురావస్తు ప్రదర్శనశాలకు తరలించిన అనేక నాణేలు, విగ్రహాలు, శాసనాలు, చారిత్రక సంపదను సైతం తీసుకురావాలని కోరుతున్నారు.