Family values | పెగడపల్లి: కుటుంబ విలువల పరిరక్షణకు ప్రతీ హిందువు నడుము బిగించాలనీ విశ్రాంత ఆర్మీ అధికారి బూర్గు జలపతి అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా పెగడపల్లి మండలం బతికేపల్లిలో ఆర్ఎస్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విజయదశమి ఉత్సవం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథి పాల్గొన్న మాజీ ఆర్మీ అధికారి బూర్గు జలపతి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వందేళ్లుగా రాజ్యాంగ బద్దంగా ఈ దేశ అభ్యున్నతి కోసం పనిచేస్తుందని చెప్పారు. వ్యక్తిత్వ నిర్మాణానికి, దేశ నిర్మాణానికి కుటుంబమే ఆధారమని ఆయన వివరించారు.
ఈ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ చేపడుతున్న చర్యలు అందరూ స్వాగతించాలని కోరారు. దేశ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ను ప్రజలకు చేరువ చేసిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సహా కార్యదర్శి గుండు సాయిమధుకర్, 18మంది స్వయం సేవక్‌లు, గ్రామస్తులు పాల్గొన్నారు.