School regularly | ధర్మారం, జులై 3 : ప్రతీరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న విద్యార్థులకు ప్రోత్సాహంగా నజరానా అందజేసి ఆదర్శంగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ ఎన్ మోతీలాల్ నాయక్, సదరు విద్యార్థులకు వారి ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో అట్టి ప్రోత్సాహక సొమ్మును అందజేసి హెడ్మాస్టర్ వారిని అభినందించారు.
వివరాల ప్రకారం.. మూడో తరగతి విద్యార్థిని పీ స్వస్తిక, ఐదో తరగతి విద్యార్థి ఎం చరణ్ పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఇంటి నుండి పాఠశాల కు దూరం ఉన్నప్పటికీ క్రమశిక్షణతో హాజరై తరగతిలో సైతం చదువులో మంచి ప్రతిభను కనభరుస్తున్నారు. ఈ విద్యార్థులు మిగతా విద్యార్థుల కంటే ఎంతో ఆదర్శంగా ఉన్నారు.
క్రమం తప్పకుండా పాఠశాలకు రావడంతో పాటు చదువులో మంచి ప్రతిభను సదరు విద్యార్థులు కనబరచడంతో వారికి ప్రోత్సాహకరంగా ఒక్కొక్కరికి రూ.2వేలు ఆర్థిక సహాయం అందించాలని పాఠశాల హెడ్మాస్టర్ మోతీలాల్ నాయక్ సంకల్పించారు. దీంతో గురువారం సదరు హెడ్మాస్టర్ ఇద్దరు విద్యార్థులకు చెరో రూ.2 వేల చొప్పున రూ.4వేల ఆర్థిక సాయాన్ని వారి ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. విద్యార్థులను పాఠశాలకు క్రమం తప్పకుండా పంపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన అభినందించారు.