Black Diamond Award | కోల్ సిటీ, మార్చి 31 : రామగుండం పారిశ్రామిక ప్రాంత సుపరిచితుడు, నాగార్జన యువ సేవా సమితి నిర్వాహకుడు, స్వచ్ఛంద, యువజన సంఘాల రాష్ట్ర ప్రతినిధి గుండేటి రాజేష్ కు జాతీయ స్థాయి ‘నల్ల వజ్రం’ పురస్కారం వరించింది. గోదావరిఖని మార్కండేయ కాలనీలో గల ఆర్కే గార్డెన్ లో హైదరాబాద్ తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నల్ల వజ్రం, ఉగాది కళోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ రంగాలలో విశిష్ట ప్రతిభ కనబరుస్తున్న, స్వచ్ఛంద సేవకులు, కళాకారులను గుర్తించి జాతీయ స్థాయి నల్ల వజ్రం ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.
దీనిలో భాగంగా గత మూడు దశాబ్దాలుగా పారిశ్రామిక ప్రాంతంలో కళాకారులను ప్రోత్సహించడంతోపాటు నాగార్జున యువ సేవా సమితి ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న గుండేటి రాజేష్ ను రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి చేతుల మీదుగా నల్లవజ్రం పురస్కారంతో ఘనంగా సత్కరించారు. మేయర్ మాట్లాడుతూ ఆవార్డులు, సత్కారాలు సమాజంలో వ్యక్తిత్వ విలువలను పెంపొందించడమే గాకుండా మరింత బాధ్యత పెంచుతుందని పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి ప్రతిష్టాత్మక పురస్కారంతో సత్కరించిన తార ఆర్ట్స్ ఆకాడమీ అధ్యక్షులు సంకె రాజేష్, నిర్వహణ కమిటీ సభ్యులకు గుండేటి రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు.