Collector Satyaprasad | సారంగాపూర్, మే 13 : రైతులకు ఇబ్బందులు కాకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సెంటర్ల నిర్వహకులను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్, రేచపల్లి, లచ్చనాయక్ తండా, నాగునూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం తూకం, నిల్వ, రవాణ ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలను అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
ఆయా సెంటర్లలో కొనుగోళ్లలో జాప్యం చేయకుండా ధాన్యం వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని అన్నారు. ఆకాల వర్షాలు ఉండడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పలిన్ కవర్లు, గన్నిసంచులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైతులు వర్షం పడుతున్న సమయంలో చెట్ట కింద, కరెంట్ పోల్ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యో విధంగా చూడాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం త్వరగా అన్లోడ్ అయ్యో విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసుదన్, డీఆర్డీవో రఘువరణ్, తహసీల్దార్ వహిదొద్దీన్, ఏపీఎం చంద్రకళ, ఆర్ఐ వెంకటేష్, రెవెన్యూ, ఐకేపీ, డీసీఎంఎస్ అధికారులు, నిర్వహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.