Chigurumamidi | చిగురుమామిడి, మే 21: కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేపట్టాలని తహసీల్దార్ మద్దసాని రమేష్, ఎంపీడీవో తూమట్ల విజయ్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని సుందరగిరి, నవాబుపేట, గాగి రెడ్డిపల్లె, ఇందుర్తి, గునుకులపల్లి, ఓగులాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు గురువారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ట్రాక్టర్లను అందుబాటులో ఉంచుకొని వెనువెంటనే రైస్ మిల్లులకు ధాన్యాన్ని అన్లోడ్ కి పంపించాలన్నారు.
ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఉదయం సాయంత్రం వేళల్లో కొనుగోలు చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్, నాయకులు చిట్టిమల్ల రవీందర్, బడుకోలు దేవేందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.