పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బందిని నియమించింది.
కరీంనగర్, ఫిబ్రవరి 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి/కలెక్టరేట్) : కరీంనగర్- ఆదిలాబాద్- మెదక్- నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి స్థానాల ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. 15 రోజులుగా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేయగా, మంగళవారం సాయంత్రం నుంచి అంతా గప్‌చుప్ అయింది. ప్రచారం ముగిసినా అభ్యర్థులు తమ గెలుపు కోసం చివరి అవకాశాన్ని సైతం సద్వినియోగం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బహిరంగ ప్రచారం వీడి, అంతర్గతంగా ఓట్లు అభ్యర్థించే పనుల్లో బిజీ అయ్యారు. పట్టభద్రుల స్థానం నుంచి 56 మంది, ఉపాధ్యాయ స్థానం నుంచి 15 మంది పోటీ పడుతుండగా, ఈ రెండు స్థానాలకు రేపే (గురువారం) పోలింగ్ జరగనుంది.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌కు అవసరమైన సామగ్రి ఇప్పటికే జిల్లాలకు చేరగా, నేడు ఆయా జిల్లాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల సెగ్మెంట్‌కు సంబంధించి 3,55,159 మంది ఓటర్లు, ఉపాధ్యాయ సెగ్మెంట్లో 27,088 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా 15 జిల్లాల పరిధిలోని 271 మండలాల్లో మొత్తం 773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 4,199 మంది సిబ్బందిని పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా 394 మంది మైక్రో అబ్జర్వర్లు, 335 మంది జోనల్ అధికారులు, 864 మంది ప్రిసైడింగ్, 2,606 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
ప్రతి మండల కేంద్రంతోపాటు మున్సిపాలిటీల్లో అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా 15 జిల్లాల్లో కలిపి 499 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉపాధ్యాయుల కోసం 274 సిద్ధం చేశారు. ఈ కేంద్రాలన్నింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని కంట్రోల్ రూంకు అనుసంధానించారు. గ్రాడ్యుయేట్లు, టీచర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వివరాలతో కూడిన స్లిప్పులు కూడా పంపిణీ చేశారు. సామగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరవేసేందుకు రూట్‌మ్యాప్‌లు కూడా సిద్ధం చేశారు.
ఒక్కో జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాలను బట్టి రూట్లుగా విభజించారు. రూట్ అధికారులను నియమించి వారికి పోలింగ్ సామగ్రితో పాటు సిబ్బందిని కేంద్రాలకు చేరవేసే బాధ్యతలు అప్పగించారు. బుధవారం ఉదయం నుంచే జిల్లా కేంద్రాల నుంచి పీఎస్‌లకు సామగ్రి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించి, అందుకనుగుణంగా పంపిణీ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది చేరుకునేలా రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు బుధవారమే చేసుకోవాలని ఎన్నికల అధికారులు పోలింగ్ సిబ్బందికి సూచించారు. పోలింగ్ అనంతరం అదేరోజు బ్యాలెట్ బాక్సులను రిసీవింగ్ సెంటర్లకు తెచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. అన్ని జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులు ఓట్ల లెక్కింపు కేంద్రమైన కరీంనగర్లో అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచేలా పటిష్ట ఏర్పాట్లు చేశారు.