మెట్పల్లి, డిసెంబర్ 23: మత్స్యకారుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పట్టణ శివారులోని పెద్దచెరువులో గురువారం ఎమ్మెల్యే చేతుల మీదుగా చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం మత్స్యకారులకు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు సబ్సిడీపై పరికరాలు, వాహనాలను అందిస్తున్నదన్నారు. నియోజకవర్గంలోని వివిధ చెరువుల్లో ఇప్పటి దాకా 20 లక్షల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. పట్టణ, పల్లెల్లోని చెరువులు, కుంటల్లో చేపల పెంపకంతో నీలం విప్లవం సృష్టించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌కుమార్, మత్స్యశాఖ జిల్లా ఏడీ నర్సింగరావు, మత్స్యకారుల సంఘం పట్టణాధ్యక్షులు శంకర్, సాయన్న, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.