ఇందిరమ్మ ఇంటి నిర్మాణ కొలతల్లో గందర గోళం నెలకొన్నది. 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా 600 చదరపు అడుగుల విస్తీర్ణానికి ఎక్కువ కాకుండా నిర్మాణం ఉండాలని తాజా నిబంధన అనేక సమస్యలకు దారి తీస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఈ విషయం చాలా మంది లబ్ధిదారులకు తెలియక ఎక్కువ విస్తీర్ణంలో ముగ్గులు పోసుకుని, బేస్మెంట్లు కూడా నిర్మించుకోవడం, 600 చదరపు అడుగులు దాటిన ఇండ్లను రిజెక్ట్ చేయాలని స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన ఇవ్వడం కలవరపెడుతున్నది. నిర్మించుకున్న బేస్మెంట్లు కూల్చేది ఎలాగని తలలు పట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆయా జిల్లాల్లో పదుల సంఖ్యలో నిర్మాణాలు జరిగినట్లు తెలుస్తుండగా, అధికారులు మాత్రం అవగాహన కల్పిస్తున్నామని, తక్కువ సంఖ్యలోనే ఉన్నాయని చెబుతున్నారు.
కరీంనగర్, మే 3 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల కొలతల విషయంలో నెలకొన్న గందరగోళం వీడడం లేదు. గత జనవరి 26న పైలెట్ గ్రామాల్లో అధికారికంగా పంపిణీ చేసిన ప్రొసీడింగ్ల్లో కొలతలు ప్రస్తావించ లేదని కొందరు లబ్ధిదారులు వాపోతున్నారు. అయితే ప్రభుత్వం కొలతలు నిర్ణయించే సరికే ప్రొసీడింగ్‌లు అందుకున్న కొందరు మార్కౌట్ ఇచ్చుకుని పునాదులు తవ్వుకున్నారు.
మరి కొందరైతే బేస్మెంట్లు కూడా నిర్మించుకున్నారు. తీరా శుక్రవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్లో 600 చదరపు అడుగులకు మించి ఉన్న ఇండ్లను రిజెక్ట్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు చేయవద్దని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇప్పటికే ఎక్కువ కొలతలతో బేస్మెంట్లు నిర్మించుకున్న లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. హౌసింగ్ బోర్డ్డు అధికారులతో తమకు ముందే చెప్పిస్తే బాగుండేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ రకంగా పదుల సంఖ్యలో ఇండ్లు ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఏఈలు ఇప్పటికే కొన్నింటిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
కొలతలు ఎక్కువ ఉన్న ఇండ్లు బిల్లుల కోసం ఆన్లైన్లో నమోదు చేస్తే ఆమోదించడం లేదు. 600 చదరపు అడుగుల్లో బేస్మెంట్ నిర్మించుకుంటే కనీసం రూ.2 లక్షలకుపైగా ఖర్చు వస్తోంది. అయితే, ప్రభుత్వం ఇచ్చేది మాత్రం రూ.లక్ష మాత్రమే. ఇందిరమ్మ ఇల్లు కింద బిల్లులు వస్తాయనే ఆశతో కొలతలు తెలియకుండా బేస్మెంట్స్ నిర్మించుకున్న లబ్ధిదారులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. అప్పు తెచ్చుకుని కట్టుకున్న బేస్మెంట్లను కూల్చే పరిస్థితి కనిపించడం లేదు. పైగా కట్టిన ఇంటిని కూల్చితే సెంటిమెంట్ ప్రకారం మంచిది కాదనే భావన లబ్ధిదారుల్లో కనిపిస్తోంది.
ముందే ఎందుకు చెప్పలేదు..?
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ప్రచారం చేసిన ప్రభుత్వం లక్షల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు పరిశీలించిన తర్వాత మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసింది. ఇప్పుడు ఈ గ్రామాల్లోనే మొదట ప్రారంభించిన ఆరుగ్యారంటీల్లో నాలుగింటిని అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైనది ఇందిరమ్మ ఇల్లు. రూ.5 లక్షలు వస్తాయంటే తమకు ఎంతో ఆసరా అవుతుందని ఆశపడిన తమకు ముందే కొలతలు ఈ విధంగా ఉండాలని ఏ అధికారి చెప్ప లేదని, కొలతలు ఎంత పెట్టుకోవాలో అడిగేందుకు కూడా అధికారులు అందుబాటులో లేరని లబ్ధిదారులు వాపోతున్నారు.
పైలెట్ గ్రామాల్లో మార్కౌట్లు ఇచ్చిన పంచాయతీ కార్యదర్శులకే ఈ విషయమై ముందు స్పష్టత లేదు. అయితే 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా ముగ్గు పోసుకోవాలని మాత్రం సూచించినట్లు తెలుస్తోంది. గరిష్టంగా 600 చదరపు అడుగులకు మించ రాదని మాత్రం తమకు చెప్పలేదని కొందరు లబ్ధిదారులు అంటున్నారు. అసలే నిరుపేదలైన లబ్ధిదారులు అప్పులు తెచ్చి కట్టుకున్న ఇండ్లను కూల్చుకోవాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో కొలతలకంటే అధికంగా నిర్మించిన బేస్మెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జగిత్యాలలో కూడా పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో మాత్రం కొంత తక్కువ సంఖ్యలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొలతల విషయంలో లబ్ధిదారులకు ముందే చెబుతున్నామని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. అధికారులు చెప్పిన తర్వాత తామెందుకు ఎక్కువ పెట్టుకుంటామని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి ప్రకటనతో నైరాశ్యం..
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రకటనతో కొలతలు ఎక్కువ పెట్టుకుని బేస్మెంట్లు నిర్మించుకున్న లబ్ధిదారులు నైరాశ్యంలో పడ్డారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, సొంత స్థలాల్లోనే ఇండ్లు నిర్మించుకుంటే రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు కొలతల విషయంలో ఆంక్షలు విధించడం కొందరు లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 600 చదరుపు అడుగులు దాటితే రిజెక్ట్ చేయాలని చెప్పడంతో ఇక తామెవరికి చెప్పుకొనేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
ప్రొసీడింగ్‌లపై కొలతలు మెన్షన్ చేశామని అధికారులు చెబుతుండగా, ముందు ఇచ్చిన ఏ ప్రొసీడింగ్‌పై కొలతల ప్రస్తావనే లేదని లబ్ధిదారులు అంటున్నారు. నిజానికి సమాచార లోపంతోనే ఇలా జరిగినట్లు స్పష్టంగా అర్థ్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేసిన ప్రభుత్వం మొదట పైలెట్ గ్రామాల్లో మాత్రమే ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్‌లు ఇచ్చింది. ఇండ్లను పర్యవేక్షించేందుకు గతంలో ఉన్న హౌసింగ్ సంస్థను పునరుద్ధరించింది. అయితే, ఈ శాఖకు మాత్రం తగినంత సిబ్బందిని మాత్రం కేటాయించ లేదు. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒక డీఈ, ఏఈని, జిల్లా స్థాయిలో ఒక పీడీని నియమించారు. ఈ లెక్కన ప్రతి జిల్లాకు ఐదుగురు అధికారులు ఉండాలి. కానీ నలుగురు మాత్రమే చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఐదుగురు అధికారులు ఉన్నా సరిపోకపోవడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు పర్యవేక్షిస్తుండగా క్షేత్ర స్థాయిలో పంచాయతీ కార్యదర్శులను వినియోగించుకుంటున్నారు. గత జనవరి 26న ప్రొసీడింగ్‌లు పంపిణీ చేసే నాటికి ఎంపీడీవోలే ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ అధికారులను నియమించారు. అయితే, ప్రొసీడింగ్‌లు ఇచ్చిన సమయంలోనే కొలతలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొలతలు మీరి నిర్మించుకున్న లబ్ధిదారులు ఇపుడు ఇందిరమ్మ బిల్లుల కోసం ఇంటిని కూల్చుకోవాలా..? అనే మీమాంసలో పడ్డారు. అయితే, ఇప్పటి వరకు కొలతలు ఎక్కువ పెట్టి నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించి, ఇక నుంచి కొలతలు సరిగ్గా అమలు చేస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.