ప్రమాదాలు, అత్యవసర సమయాల్లో ప్రాణాలకు భరోసానివ్వాల్సిన క్రిటికల్ కేర్ సెంటర్‌ను కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. ఏడాది క్రితమే భవనం ప్రారంభోత్సవమైనా.. వైద్యులు, సిబ్బందిని నియమించకుండా వివక్ష చూపుతున్నది. ఉమ్మడి జిల్లాలకు విశిష్ట సేవలందే ప్రభుత్వ దవాఖానను పట్టించుకోవాల్సిన ఉమ్మడి జిల్లా మంత్రులు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. ఫలితంగా కోట్లు వెచ్చించి నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్ అలంకార ప్రాయంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. దీంతో పేదలపై లక్షల్లో ఆర్థికభారం పడుతున్నది.
ఈ విషయంలో అమాత్యులు చొరవ చూపితే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశమున్నా.. అశ్రద్ధ చేస్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే రెండేళ్ల క్రితమే 2డీ ఎకో యంత్రం వచ్చినా.. కార్డియో, న్యూరో వ్యైద్యులు లేక నిరుపయోగంగా మారింది. ఒకప్పుడు వరంగల్ ఎంజీఎం తర్వాత ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలిచిన కరీంనగర్ సర్కారు దవాఖాన, ఇప్పుడు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నది. అన్ని హంగులున్న ఈ హాస్పిటల్‌ను రిఫరల్ దవాఖానగా మార్చాలని ప్రజలు కోరుతుంటే.. సర్కారు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే తాజాగా జరిగిన హెచ్‌డీఎస్ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క మంత్రి హాజరు కాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ విద్యానగర్ : ప్రమాదాలు, అత్యవసర సమమాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన ఆవరణలో రూ.23.72 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ సెంటర్‌ను నిర్మించారు. దీనిని గతేడాది జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే ఈ కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కరీంనగర్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఎంతో మేలు చేకూరే అవకాశమున్నది. ఆ కోణంలో గతంలోనే నిధుల కేటాయింపులు చేయడంతో అధునాతనంగా నిర్మించారు.
అందుకోసం పలు పరికరాలు కూడా తెప్పించారు. కానీ, దీనిని ఆర్భాటంగా ప్రారంభించిన మంత్రులు, ఆ తర్వాత బాధ్యతను విస్మరించారన్న విమర్శలు వస్తున్నాయి. అవసరమైన వైద్యులు, నర్సింగ్, టెక్నీషియన్ తదితర సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించడంలో విఫలమయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి రాక పోగా.. కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారింది. అంతేకాదు, కోట్లాది రూపాయలతో ఆధునిక పరికరాలు తెచ్చినా.. వాటిని అమర్చేందుకు కావాల్సిన నిధులు ఇవ్వడంలో సర్కారు వివక్ష చూపుతున్నది. నిజానికి ఇది అందుబాటులోకి వస్తే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణలోని మెజార్టీ జిల్లాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రమాదాలు జరిగిన సమయంలో మెరుగైన వైద్యసేవలు ఇక్కడే అందించే అవకాశం ఉంటుంది.
అయితే ఈ పరిస్థితుల్లో క్రిటికల్ కేర్ సెంటర్‌ను పూర్తిస్థాయిలో నిర్వహించాలంటే భవనం, పరికరాలు మాత్రమే సరిపోవని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు, అనస్థీషియాలజిస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులతోపాటు ప్రత్యేక శిక్షణ పొందిన నర్సింగ్, సాంకేతిక సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. 24 గంటలూ వైద్య సేవలు అందేలా షిఫ్ట్‌ల వారీగా సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు ప్రత్యేక దృష్టిసారించి, క్రిటికల్ కేర్‌కు సిబ్బందిని కేటాయించి సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్యం పెద్ద ఆర్థిక భారంగా మారుతున్నది. ప్రభుత్వ దవాఖానలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, అనస్థీషియా, క్రిటికల్ కేర్ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటళ్లలో అత్యవసర చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. నిజానికి కరీంనగర్ భౌగోళికంగా తెలంగాణలో కీలక ప్రాంతంలో ఉన్నది. చుట్టుపక్కల జిల్లాల ప్రజలు వైద్యం కోసం కరీంనగర్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానకు పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిని పూర్తిస్థాయి రిఫరల్ దవాఖానగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది.
కరీంనగర్ చుట్టుపక్కల జాతీయ రహదారులు అధికంగా ఉండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో క్షతగాత్రులకు క్రిటికల్ కేర్, కార్డియో, న్యూరో సేవలు అవసరమవుతాయి. స్థానికంగా పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో లేకపోవడంతో కొందరు రోగులను వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు తరలిస్తున్నారు. అత్యవసర సమయంలో ప్రతి నిమిషం కీలకం కాగా, రోగులను దూర ప్రాంతాలకు తరలించే క్రమంలో పరిస్థితి విషమించే ప్రమాదం ఉంటున్నదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు దవాఖానలో నెలకొన్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు, రోగులకు అందాల్సిన సేవలు వంటి అంశాలపై తాజాగా జరిగిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క మంత్రి హాజరు కాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి సర్కారు దవాఖానకు సంబంధించి ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యమైనది. కానీ, మంత్రులు డుమ్మా కొట్టడంపై విమర్శలు వస్తున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన పేరుకు రిఫరల్ హాస్పిటల్ అయినప్పటికీ.. ప్రజలకు అందుతున్న సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మాత్రం ఆశించిన స్థాయిలో అందడం లేదు. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలున్నాయి.
రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేకపోవడం, కార్డియో-న్యూరో వంటి కీలక విభాగాల్లో నిపుణుల కొరత ఉండడం, ఆధునిక వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో వినియోగంలో లేకపోవడం వంటి సమస్యలు దవాఖాన సేవలపై ప్రభావం చూపుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రిటికల్ కేర్ సెంటర్, 2డీ ఎకో యంత్రం వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేకపోవడం, వైద్యులు, సిబ్బంది నియామకం, ఎంఆర్ఐ సదుపాయం, సూపర్ స్పెషాలిటీ విభాగాల ఏర్పాటు వంటి అంశాలపై మంత్రులు దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా.. కోట్లాది రూపాయలతో నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్, లక్షల రూపాయలతో సమకూర్చిన వైద్య పరికరాలు ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అలాగే 2డీ ఎకో యంత్రాన్ని వెంటనే వినియోగంలోకి తేవడంతోపాటు కార్డియో, న్యూరో, అనస్థీషియా, క్రిటికల్ కేర్ వైద్యులను నియమించే విధంగా ఉమ్మడి జిల్లా మంత్రులు సర్కారు దృష్టికి తీసుకెళ్లాలని, ఎంఆర్‌ఐతోపాటు అన్ని ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఓ సమీక్ష సమావేశం నిర్వహించాలని, కరీంనగర్ ప్రభుత్వ దవాఖానను పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ రిఫరల్ హాస్పిటల్‌గా తీర్చిదిద్దేందుకు అసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ దిశగా మంత్రులుచర్యలు తీసుకుంటారా.. లేదా..? అన్నదానిపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.