BC Study Circle | కార్పొరేషన్, ఏప్రిల్ 3 : కరీంనగర్ జిల్లాలో అనేక పోరాటాలు చేసి సాధించుకున్న బిసి స్టడీ సర్కిల్ ను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసేందుకు కుట్రలు పొందుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రూ. ఐదు కోట్ల నిధులతో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కోచింగ్ లను ఇచ్చే దిశగా కరీంనగర్లో స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేసుకుంటే ప్రస్తుతం దానిలో బీసీ గురుకుల పాఠశాలను తరలించి ఇక్కడి నుండి పూర్తిగా స్టడీ సర్కిల్ ను ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
మహబూబ్నగర్ జిల్లా నుండి కరీంనగర్ కు స్టడీ సర్కిల్ ను బీసీ సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేసి తెప్పించుకుంటే పక్కా భవనం కావాలని కోరగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉజ్వల పార్క్ సమీపంలో ఎకరం భూమిలో రూ.ఐదు కోట్ల వ్యయంతో పక్కా భవనాన్ని నిర్మించారని తెలిపారు.
హైదరాబాద్ తరహాలో సివిల్ సర్వీస్ లాంటి కోచింగ్ లకు అవకాశం ఇచ్చే విధంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఈ భవనాన్ని పూర్తిగా స్టడీ సర్కిల్ కు వినియోగించకుండా బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి బీసీ స్టడీ సర్కిల్ ను అక్కడినుండి ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నారని, వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని స్టడీ సర్కిల్ కు పూర్తి భవనాన్ని అందుబాటు అయ్యేలా చేసి బిసి గురుకుల పాఠశాలకు మరో సొంత భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.