Collector Koya Sri Harsha | పెద్దపల్లి, జూలై 14: గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ పాలన పకడ్బందీగా సాగాలని జరగాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవం, తదితర అంశాల పై మండల అధికారులతో సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ సమావేశమయ్యారు. ప్రతి మండలంలో వన మహోత్సవం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.
మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పనుల కింద గుంతల తవ్వకం పనులు చేపట్టాలన్నారు. ఈజీఎస్ కూలీలకు కనీస సరాసరి వేతనం రోజుకు రూ.307 వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో కనీసం 20 ఎకరాలను ఎంపిక చేసి కమ్యూనిటీ ప్లాంటేషన్ చేపట్టాలని, ప్రతీ గ్రామంలో కనీసం 5 చోట్ల సామాజిక ఇక్కడ గుంతల తవ్వకం చేపట్టాలని, వారం రోజుల్లో పనులను ప్రారంభించాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ర్ట ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనతో లింక్ చేస్తుందని, దీనికి సంబంధించిన యాప్లో సర్వే పనులు మరో 70 గ్రామాలలో పెండింగ్ ఉన్నాయన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. జడ్పీ సీఈవో నరేందర్, డీఆర్డీవో కాళిందిని, హౌసింగ్ పీడీ రాజేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.