రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన రూ.10లక్షల విలువైన వంద సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేశామని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గితె తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు సెల్ఫోన్లు అందజేసి, మాట్లాడారు. సెల్‌ఫోన్ దొంగలకు చెక్ పెట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ డీవోటీ, సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు.
ఈ పోర్టల్ వినియోగం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని, చోరీకి గురైన సెల్ఫోన్లను రికవరీ చేయడంలో జిల్లాకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 1,887సెల్ ఫోన్లను గుర్తించి 1,587 మంది బాధితులకు అందించామని చెప్పారు. ఫోన్ల రికవరీలో జిల్లా 84.1శాతంతో గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో సెల్‌ఫోన్ లేనిదే లావాదేవీలు చేయలేని పరిస్థితి ఉందన్నారు.
ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేస్తే సంబంధిత షాపు నుంచి రసీదు తీసుకోవాలని సూచించారు. ఫోన్లను రికవరీ చేసిన ఐటీకోర్ సిబ్బందిని అభినందించారు. చోరీకి గురైన సెల్ఫోన్లు అప్పగించిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మురళీకృష్ణ, ఐటీకోర్ ఎస్ఐ కిరణ్‌కుమార్, ఆర్ఐలు రమేశ్, యాదగిరి, ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.