Godavarikhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 3 : గురువారం ఉదయం కురిసిన తేలికపాటి వర్షానికే గోదావరిఖని నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్‌లో రోడ్లు వాగులను తలపించాయి. వరద నీరు ఎక్కడికి అక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 51వ డివిజన్ కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేష్ రోడ్ల దుస్థితిని పరిశీలించి మాట్లాడారు. వరదనీటిని మళ్లించేందుకు డ్రైనేజీ వ్యవస్థ శాస్త్రీయంగా లేకపోవడంతో ప్రధాన రోడ్లపైనే వరదనీరు నిలిచి పోతుందని, దీంతో లక్ష్మీనగర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులను అభద్రతా భావంకు గురవుతున్నారని పేర్కొన్నారు. నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై రూ. కోట్ల ప్రజాధనంతో రోడ్లు నిర్మించారని, కానీ వర్షం పడితే ఆ వరదనీరు ఎటు వెళ్లాలి..? అనే కనీస ఆలోచన చేయలేదని ఆరోపించారు.
రోడ్లపై నిలిచిన పరదనీరు షాపుల్లోకి చేరడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. అర్హత లేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని ఆరోపించారు. భవిష్యత్ ప్రయోజనాలకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు. రోడ్డు, ఫుట్‌పాత్ నిర్మాణాల ఎస్టిమేట్ కాపీ ఇవ్వాలని కాంట్రాక్టర్ ను అడిగితే ఇవ్వకుండా దాటవేసినప్పుడే అనుమానాలు వచ్చాయని పేర్కొన్నారు. మేయర్, కమిషనర్ స్పందించి వర్షపునీరు ఎక్కడికక్కడ డ్రైనేజీలోకి వెళ్లేలా శాశ్వత పరిష్కారం చూపాలనీ, నిర్మించిన రోడ్లు, ఫుట్ పాత్ ల నాణ్యతపై సమగ్రంగా తనిఖీ చేయాలనీ, ప్రజల సొమ్ముతో జరుగుతున్న పనుల్లో పారదర్శకత, నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.