Girls’ education | ధర్మారం, ఏప్రిల్ 30 : బాలికలు విద్యను అభ్యసించడానికి వారు మరింత పురోగతి సాధించడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని అందించి తోడ్పడాలని, బాలికల చదువు ప్రతీ ఇంటికి వెలుగు అని మహిళా సాధికారత జిల్లా కోఆర్డినేటర్ దయా అరుణ అన్నారు. పెద్దపల్లి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అదనపు జిల్లా బాలికల సంరక్షణ అధికారి సంపద కుమారి ఆధ్వర్యంలో బుధవారం ధర్మారం, మేడారం అంగన్వాడీ సెక్టార్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా కేంద్రాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ బాలికలు పాఠశాలలో చదవడానికి తల్లులు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని అన్నారు. బాలికల పట్ల ఎలాంటి వివక్ష చూపవద్దని ఆమె పేర్కొన్నారు. వారిని ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత విద్య పూర్తి చేయడానికి సహకరించాలని అన్నారు. బాలికల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు బ్లాండినా, భాగ్య లక్మి, అంగన్వాడీ టీచర్లు, ఐసీపీఎస్ సభ్యులు పాల్గొన్నారు.