Ghosh report | చిగురుమామిడి, సెప్టెంబర్ 1: ఘోష్ కమిషన్ రిపోర్టు సాకుతో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందని, కాలేశ్వరం ప్రాజెక్టు జలాలతో హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, ఆర్బీఎస్ జిల్లా మాజీ కోఆర్డినేటర్ సాంబారీ కొమురయ్య అన్నారు. మండలంలోని చిన్న ముల్కనూర్ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి కెనాల్ నుండి గోదావరి జలాల నీటిని బిందెలలో తీసుకువచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని శుద్ధి చేశారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.
వారు మాట్లాడుతూ కాళేశ్వరం మీద బురద చల్లేందుకు, రాజకీయ కక్ష తీసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు విపల ప్రయత్నం చేస్తున్నారని, ఘోష్ నివేదిక అబద్దాల పుట్ట అని వారన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో చుక్కలు చూపించారని, అధికార కాంగ్రెస్ అడ్డగోలు వాదనను ఎక్కడికి అక్కడ చీల్చి చెండాడని, దాంతో కాంగ్రెస్ ఆత్మరక్షణ స్థితిలో పడిపోయిందని అన్నారు. కాళేశ్వరం జలాలను వాడుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఎద్దేవా చేశారు.
చిగురుమామిడి మండలం ఒకప్పుడు తీవ్ర నీటి ఎద్దడి, కరువుతో తాండవించేదని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపి కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించారని వారన్నారు. దీంతో భూములకు రెక్కలు వచ్చాయన్నారు. నేటికీ రైతులు బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు కరివేద మహేందర్ రెడ్డి, పెసరి రాజేశం, కృష్ణమాచారి, బరిగెల సదానందం, ముప్పిడి నరసింహారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు బుర్ర తిరుపతి, గిట్ల తిరుపతిరెడ్డి, మారెళ్ల కొమురయ్య, గుంటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.