Free sports | హుజూరాబాద్ టౌన్, మే 30 : ఉచిత క్రీడా శిక్షణా శిబిరాలు సమాజానికి ఎంతో అవసరమని బుల్లితెర హాస్యనటుడు ఆర్ఎస్ నంద( ఆర్ సదానందం) అభిప్రాయపడ్డారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాస్యనటుడు ఆర్ఎస్ నంద హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులను సెల్ఫోన్లకు అతుక్కుపోకుండా క్రీడలు దోహదపడుతాయన్నారు. ప్రతీ సంవత్సరం ఇలానే ఉచిత వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి క్రీడలను విద్యార్థుల బంగారు భవిష్యతుకు పునాదులు వేయాలని ఆకాంక్షించారు. అనంతరం క్రీడాకారులకు పౌష్ఠికాహారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య, మున్సిపల్ ఇంజనీర్ సాంబరాజు, కార్యాలయ మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు జే శ్రీకాంత్, రషీద్, డాక్టర్ వీణ, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరిప్రసాద్, అసోసియేషన్ సభ్యులు, హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్, కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు.