యువకుడు పరశురాం మూడేళ్ల కృషికి దక్కిన ఫలితం
స్టార్టప్ కంపెనీ స్థాపించి పవర్ బైక్ తయారీ
కుటుంబ సభ్యుల సహకారం
తోడైన సిరిసిల్ల యువ ఇంజినీర్ల మేథస్సు
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు
మంత్రి కేటీఆర్ అభినందన
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 5 ;కేవలం పది పైసల ఖర్చుతో కిలో మీటర్ దూరం ప్రయాణించే పవర్ బైక్‌ను రూపొందించి యువ ఇంజినీర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన పాక పరశురాం. సాంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలతో అధికంగా ఖర్చవడం చూసి ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని అనుకున్నది సాధించాడు. పుట్టింది సింగారం గ్రామమే అయినా, విద్యాభ్యాసం హైదరాబాద్‌లో పూర్తిచేసి, సరికొత్త పవర్ బైక్‌ను సృష్టించి స్వగ్రామానికే కాకుండా రాష్ర్టానికి పేరుతీసుకొచ్చాడు. బైక్ తయారీలో ఎదురైన సవాళ్లు, లక్ష్య సాధనపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఊళ్లో పని లేక తాను పడుతున్న కష్టం తన కొడుకులకు రావద్దని ఇద్దరినీ చదువు కోసం హైదరాబాద్‌లోని తన అత్తగారింటికి పంపించాడు. కొన్ని రోజుల తర్వాత తాను కూడా అక్కడికే వెళ్లి మెకానిక్‌గా మారాడు. కుటుంబ పోషణ భారం కావడంతో పెద్ద కొడుకు తండ్రితో పాటు మెకానిక్ పని నేర్చుకున్నాడు. చిన్న కొడుకు మాత్రం కష్టపడి మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. అంతే కాకుండా సంప్రదాయ ఇంధనాలతో నడిచే బైక్‌లు కాకుండా పవర్ బైక్‌ను తయారు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాడు. కుటుంబ సభ్యులు, మిత్రుల ప్రోత్సాహంతో లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించాడు. కేవలం పది పైసల ఖర్చుతో కిలో మీటర్ ప్రయాణించేలా ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించి మంత్రి కేటీఆర్‌ను ముగ్ధుడిని చేయడమే కాకుండా అనేక మంది ప్రశంసలు అందుకున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం ముద్దుబిడ్డ పాకాల పరశురాం.
మంత్రి కేటీఆర్ అభినందన
తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం ఇస్తున్న క్రమంలో పరశురాం దేశీయ విడిభాగాలను వినియోగిస్తూ హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ప్లాంటు ఉత్పత్తులు ప్రారంభించారు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించిన విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ జడ్జి జయసింహతో కలిసి అతడిని అభినందించి, అవార్డును అందించారు. అతి తక్కువ ఖర్చుతో కిలోమీటర్ నడిచే ఎలక్ట్రిక్ బైక్‌ను హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ, అందులో సిరిసిల్లకు చెందిన యువకుడి ఇంటలెక్చువల్ శ్రమతో రూపొందడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సదరు పైలట్ ప్రొడక్ట్ బైక్‌ను చూసి ముగ్దుడై, యువకుల ఇంటలెక్చువల్ షిప్పుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఆలోచనే అవకాశంగా..
2008లో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన పరశురాం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు. మొదటి నుంచి పవర్ బైక్ తయారీపై ఉన్న మక్కువతో యూఎస్‌లో ఉంటూనే స్కైప్ ద్వారా ప్రతిభ గల 60 మంది విద్యార్థులను హైర్ తీసుకుని బైక్ తయారీకి పూనుకున్నాడు. 2016లో అమెరికాలో ఉన్నప్పుడే తనతో పనిచేసే వాసవి పవర్ బైక్ తయారీకి చేదోడు వాదోడుగా నిలిచింది. 2019లో ఇద్దరూ హైదరాబాద్‌కు వచ్చి వివాహం చేసుకున్నారు. ఒకరి ఆలోచనను మరొకరు షేర్ చేసుకుని ఎలక్ట్రిక్ బైక్ తయారీకి శ్రీకారం చుట్టారు. అదే ఏడాది ‘గ్రావ్టన్ మోటార్స్’ అనే పేరుతో స్టార్టప్ కంపెనీని నెలకొల్పాడు. బైక్ తయారీలో తన సోదరుడు శ్రీధర్‌తో పాటు సిరిసిల్లకు చెందిన నలుగురు యువ ఇంజినీర్లు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందించిన ప్రోత్సాహం, సహకారంతో పవర్బైక్ను రూపొందించారు. 2019లోనే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సు వారిని సంప్రదించి ట్రయల్స్ చేసేందుకు అర్జీ పెట్టుకున్నారు. అదే ఏడు రైడ్ చేసేందుకు ప్రయత్నించగా కొవిడ్ కారణంగా రెండేళ్లు వాయిదా పడింది. ఎట్టి పరిస్థితిలో సక్సెస్ కావాలనుకున్న అతడు గతేడాది సెప్టెంబర్ 11న 14 మంది బృందం పర్యవేక్షణలో తానొక్కడే నిద్రలేకుండా 23 గంటల పాటు హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు 1320 కిలోమీటర్లు నడిపి బైక్ సామర్థ్యాన్ని నిరూపించాడు. 13వ తేదీ నుంచి ఒక్కొక్కరూ మారుతూ ఐదుగురు కన్యాకుమారి నుంచి లడఖ్‌లోని ఖుర్దుంలా వరకు 4011.9 కిలోమీటర్లు 164 గంటల 30 నిమిషాలు నాన్‌స్టాప్ రైడ్ చేసి అరున్నర రోజుల్లో అంటే సెప్టెంబర్ 20న చేరుకుని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించారు. లడఖ్ సమీప ప్రాంతమైన ఖుర్దుంలా సముద్ర మట్టానికి 18 వేల అడుగులు ఎత్తు, అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల రైడర్స్‌కు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా బైక్ సామర్థ్యం, పనివేగం తగ్గలేదని పరశురాం తెలిపాడు. కేవలం పది పైసల ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణించ వచ్చని చెబుతున్నాడు.
సింగారం గ్రామానికి చెందిన పాక బాలయ్య-బాలవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు శ్రీధర్, పరశురాం. వీరిని చిన్నతనంలోనే చదువు కోసం తండ్రి బాలయ్య హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఉంటున్న తన బావమరుదుల వద్దకు పంపించాడు. గ్రామంలో పరిస్థితులు బాగాలేకపోవడం, వ్యవసాయం కలిసి రాకపోవడంతో బాలయ్య సైతం 1990లో హైదరాబాద్ వెళ్లి ఓ మెకానిక్ వద్ద రోజుకు రూ.15కు చేరి ఐదేండ్లు పని నేర్చుకున్నాడు. తర్వాత మెకానిక్‌గా మారిన బాలయ్యతో పెద్ద కొడుకు శ్రీధర్ సైతం పని నేర్చుకుని తానొక మెకానిక్ షాపు పెట్టుకున్నాడు. చిన్న కొడుకు మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. అయితే, ఆయన సంప్రదాయ పెట్రోలు బైక్‌లతో వాతావరణ కాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా పవర్ టెక్నాలజీతో జీరో పొల్యూషన్ వాహనం తయారు చేయాలనుకుని లక్ష్యం దిశగా అడుగేశాడు.
నా కొడుకుపడ్డ కష్టానికి ఫలితం..
నా ఇద్దరు కొడుకులను వారు చిన్నగున్నప్పుడే హైదరాబాద్‌లో ఉన్న మా బామ్మర్దుల దగ్గరకు పంపిన. అక్కడనే చదువుకున్నరు. ఊల్లె ఎంత ఎవుసం చేసినా ఏం మిగలకపోయేసరికి నేనుగూడ 1990ల నా భార్య బాలవ్వతో కలిసి హైదరాబాద్ పోయిన. మా బామ్మర్దులతోపాటు మెకానిక్ పనిజేసిన. పెద్ద కొడుకు పదోతరగతి అయిపోయినంక మెకానిక్ పని నేర్చుకుని షాపు పెట్టుకున్నడు. బైక్‌లు రిపేర్ చేసుడు మాకు అబ్బిన విద్య. గా టైంలనే నా చిన్న కొడుకు అమెరికాకు పోయి ఉద్యోగం జేసిండు. అప్పటికి వాడికి పవర్ బైక్ తయారుజెయ్యాలనే కోరిక ఉండేది. 2019ల వచ్చి బైక్ తయారుజేసుడు మొదలుపెట్టిండు ఇప్పుడు మంత్రి కేటీఆర్ సారు మెచ్చుకున్నట్లు పేపర్ల జూసి ఊరోళ్లు జెప్పితే శానా సంతోషమనిపించింది. వాడు పడ్డ కష్టానికి ఫలితం దొరికింది.
-పాక బాలయ్య, పరశురాం తండ్రి, సింగారం, ఎల్లారెడ్డిపేట
‘.