కరీంనగర్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లుల కోసం ఉద్యమిస్తున్న మాజీ సర్పంచులపై రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. ఎక్కడికక్కడ నిర్భందించి అణచివేస్తున్నది. సోమవారం మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘చ లో హైదరాబాద్’ పేరిట పోరుబాటకు సిద్ధమవుతున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మాజీ సర్పంచులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి నిర్భందించారు. మాజీ మహిళా సర్పంచులను సైతం అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని ముందే ఊహించిన కొందరు సర్పంచులు ఒక రోజు ముందుగానే హైదరాబాద్ వెళ్లారు.
సర్పంచుల ఫోరం సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు ఆధ్వర్యంలో కొందరు మాత్రమే వెళ్లారు. అప్పులు తెచ్చి, బంగారం కుదువబెట్టి గ్రామా ల్లో అభివృద్ధి పనులు చేశామని, ఇప్పుడు అప్పులకు వడ్డీలు కట్టలేని స్థితిలో ఉన్నామని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన తమపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆరోపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పెండింగ్ బిల్లులు ఇస్తామని నమ్మించి, తమతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ఇపుడు తమను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. తక్షణమే తమ పెండింగ్ బిల్లులు ఇప్పించాలని డి మాండ్ చేస్తున్నారు. ఒక్కో పంచాయతీలో ఒక్కో సర్పంచుకు 2 లక్షల నుంచి మొదలుకుని 20లక్షల వరకు రావాలని, తాము అప్పులు తెచ్చిన పైసలకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని మండెపల్లి మాజీసర్పంచ్ శివజ్యోతి ఆవేదన వ్యక్తంచేశారు.