మానకొండూర్, సెప్టెంబర్ 5:‘ కవ్వంపల్లి సత్యనారాయణ ఏదో చేస్తాడని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మానకొండూర్ నియోజకవర్గంలో కమీషన్లు, పైరవీల రాజ్యం, అరాచక పాలన నడుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి మండల కేంద్రంలోని గడిమహల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలో తీవ్రనష్టం జరిగిందని, కల్వర్టులు తెగిపోయి రోడ్లు ధ్వంసమవడంతో కొన్ని గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. బెజ్జంకి మండలం తోటపల్లిలో ఒక నిరుపేద మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి గల్లంతయితే ఇప్పటివరకు ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క అధికారైనా పరామర్శించిన దాఖలాలు లేవన్నారు.
భారీ వర్షాలకు నియోజకవర్గం అతలాకుతలమైతే అధికారులతో సమీక్షించి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన ఎమ్మెల్యే కవ్వంపల్లి, నియోజకవర్గాన్ని వదిలి పత్తాలేకుండా హైదరాబాద్ పోయి సెక్రటేరియట్లో పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఆయనకు అనుకూలంగా తహసీల్దార్, ఎంపీడీవో, సీఐ, ఎస్ఐలకు పోస్టింగులు ఇప్పించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
వర్షాలకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు నిధుల కోసం సీఎం వద్దకు వెళ్లి చర్చిస్తే బాగుంటుందని, కానీ ఆయన పోస్టింగ్ ఇప్పించిన ఒక సీఐని పోలీస్ కమిషనర్ ఇబ్బందులు పెడుతున్నారని, పట్టించుకోవడం లేదంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని, ఇది అతని అవివేకానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఒక సీఐ విషయంలో ఎమ్మెల్యే సీఎం వద్దకు పోయి ముక్కుసూటిగా వ్యవహరించే సీపీపై ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు.
దళిత ఎమ్మెల్యే అయి ఉండి దళిత జాతి ఆత్మగౌరవాన్ని కవ్వంపల్లి దెబ్బతీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు రుణమాఫీ పూర్తిగా జరుగలేదని, రైతుబంధు, రైతుబీమా ఊసే లేదన్నారు. కవ్వంపల్లి అనుచరుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, గ్రామాల్లో కనీసం ఒక పాన్ డబ్బా పెట్టుకోవాలన్న కమీషన్ ఇవ్వనిదే పని కావడం లేదని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే ఎన్నికల్లో ప్రజలు, రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఇక్కడ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్వై నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరు సురేష్, మానకొండూర్ సింగిల్ విండో చైర్మన్ నల్ల గోవిందరెడ్డి, నాయకులు రామంచ గోపాల్‌రెడ్డి, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, పిట్టల మధు, సాదవేణి రాజుయాదవ్, శాతరాజు యాదగిరి, దండబోయిన శేఖర్, కొట్టె రఘు, బోడ రాజశేఖర్, గోపుఈశ్వర్రెడ్డి, ముల్కల కరుణాకర్ గౌడ్ పాల్గొన్నారు.