‘నేను ఇక్కడికి నాయకుడిగా రాలేదు. కొదురుపాక మనుమడిగా వచ్చిన. ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణానికి ముందు శాభాష్‌పల్లి పాత వంతెన పైనుంచి వానకాలంలో ఎప్పుడూ వరద వచ్చేది. దాటనిచ్చేది కాదు, తక్కువ నీళ్లు వస్తే ప్యాంట్ పైకి మలుచుకుని వెళ్లేది. తర్వాత మా తాతయ్య కేశవరావు అడ్డ రోడ్డు నుంచి ఆటో రిక్షాలో కొదురుపాక సుభాష్ బొమ్మ వద్దకు తీసుకెళ్లెటోడు. అక్కడి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. మా అమ్మమ్మ ఇంటి ముందు అనంతరాములు సేట్ దుకాణం ఉండేది. అందులోంచి బిస్కెట్ పూడలు తీసుకొని తినేది. మా అమ్మమ్మ ఊరు కొదురుపాక ఎంఎంఆర్‌లో, నాయనమ్మ ఊరు అప్పర్ మానేర్డ్యామ్లో, ఇంకో అమమ్మ ఊరు వచ్చునూర్ ఎల్ఎండీలో ముంపునకు గురయినయి. ముంపు గ్రామాల సమస్యలేంటో నాకు తెలుసు’
– ఇలా కొదురుపాకలో కేటీఆర్ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు
Ktr
బోయినపల్లి, సెప్టెంబర్ 26: కొదురుపాక మనుమడిగా గ్రామానికి ఎప్పటికీ అండగా ఉంటానని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా ఇచ్చారు. తన అమ్మమ్మ, తాతయ్య జోగినపల్లి లక్ష్మి-కేశవరావు జ్ఞాపకార్థం తన సొంత డబ్బుతో గ్రామంలో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు.
అంతకు ముందు కేటీఆర్‌కు హైలెవల్ వంతెన వద్ద చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తిరుపతి దేవస్థానం ప్రసాదం ఇవ్వగా, బీసీఎం వ్యవస్థాపకుడు, ప్రముఖ కంటివైద్య నిపుణుడు వైరాగ్యం రాజలింగం పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కరచాలనం చేస్తూ పేరు పేరునా పలుకరించారు.
తర్వాత చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పాఠశాల, తరగతి, కంప్యూటర్ గదులు, డైనింగ్ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రస్తుతం తమ అమ్మమ్మ ఊరిలో పాఠశాల నిర్మాణం పూర్తయిందని, గ్రామంలో మిగిలిన ఆలయాలను కూడా రాజకీయాలకతీతంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. చాకలి ఐలమ్మ వర్ధంతి రోజు పాఠశాల భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
వాస్తవంగా ప్రారంభోత్సవానికి అమ్మ శోభ రావాల్సి ఉండెనని, కానీ ఆమె రాలేక పోవడం వల్ల వారి ఏకైక సోదరుడైన తన మేనమామ జోగినపల్లి శ్రీనివాసరావును పంపించారని చెప్పారు. వేదికపై పేరు పేరునా పిలుస్తున్న సమయంలో పిలువని వారు తిట్టుకోవద్దని, ఒక వేళ తిట్టుకుంటే లోపల తిట్టు కోవాలని, బయటకు తిట్టుకోవద్దని అంటూ నవ్వులు పూయించారు. ‘చొప్పదండి ఎమ్మెల్యే సత్యం మా వాడు.. నా తమ్ముడు.. ఎందుకంటే నా నియోజకవర్గ పరిధిలోని కోరుట్లపేట ఓటరు’ అని చెప్పడంతో వేదిక కింద ఉన్న అందరూ నవ్వుతూ ‘జై కేటీఆర్’, ‘జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు.
కేటీఆర్ తమ కుటుంబ సభ్యులను గుర్తు చేస్తున్న తరుణంలో విద్యార్థులు కేరింతలు కొట్టగా.. ‘జర ఆపండ్రా బాబూ మా వాళ్లనే మేం గుర్తు చేయద్దా’ అని నవ్వుతూ ప్రసంగించారు. కొదురుపాకలో ఆలయాలు నిర్మాణం పూర్తయ్యాక ఊరందరికీ తానే భోజనాలు పెడతానని చెప్పగా, వెంటనే సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకట్రామారావు లేచి ‘లేదు.. లేదు నేనే పెడతా’ అని చెప్పారు. దీంతో కేటీఆర్ స్పందిస్తూ ‘అగో చూసినవా.. వెంకట్రామారావు మామయ్య ఒప్పు కోవడం లేదు. ఓకే’ అని చెప్పారు.
అనంతరం తన అమ్మమ్మ-తాతయ్య పేరుతో కొదురుపాకలో అత్యాధునిక హంగులతో పాఠశాల భవనం నిర్మించినందుకు కేటీఆర్‌ను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో జయశీల, సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకట్రామరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొండయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్ సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బొలుమాల శంకర్ కూస రవీందర్, భీమ్‌రెడ్డి మహేశ్వర్‌రెడ్డి, ఆరు మండలాల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలున్నారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కొదురుపాకలో మాజీ మంత్రి కేటీఆర్ తన అమ్మమ్మ-తాతయ్య జ్ఞాపకార్థం పాఠశాల భవనం నిర్మించడం చాలా సంతోషమని, అందుకు రామన్నను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులు, ఉపాధ్యాయుల తరఫున కృతజ్నతలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థ పూర్తిగా వెనుకబడి పోయిందని, ప్రస్తుత ప్రభుత్వం విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి పాఠశాలల్లో సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ అమ్మమ్మ- తాతయ్య పేరిట పాఠశాల భవనం నిర్మించిన మాజీ మంత్రి కేటీఆర్ నిజమైన హీరో అని కొనియాడారు. దేశం, రాష్ట్రంలో ఎంతో మంది కోటీశ్వర్లుంటారు కానీ, గ్రామాలకు ఇలా ఎవరూ సేవ చేయరు అని చెప్పారు.
Ktr
నేతన్నలకు ఉపాధి చూపినం
వస్త్ర పరిశ్రమకు కేంద్రబిందువైన సిరిసిల్లను మరో తిరుపూర్‌గా తీర్చి దిద్దాలన్న ఉద్దేశ్యంతో వస్త్ర ఉత్పత్తిదారులను స్టడీ టూర్‌కు బస్సుల్లో తమిళనాడుకు పంపించినం. కేసీఆర్ ప్రభుత్వంలో రూ.వేల కోట్ల వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వడం వల్ల వేతనాలు రెట్టింపు అయినయ్. రూ.8 వేలు సంపాదించే కార్మికులు రూ.20 వేలు సంపాదించే స్థాయికి ఎదిగిన్రు. ఆత్మహత్యలు, ఆకలి చావుల నుంచి బయటపడి ఇప్పుడిపుడే మొహం తెలివికొస్తుందన్న సమయంలో దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.
నా మీద కోపం.. మా పార్టీ మీద కోపం.. ఇక్కడి ప్రజలు నన్ను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించండ్రన్న కోపం.. కాంగ్రెస్‌ను తిరస్కరిస్తున్నారన్న కోపంతో ప్రజలపై, నేతన్నలపై పగపట్టి ప్రతికారం తీర్చుకుంటున్నరు. బతుకమ్మ చీరెల ఆర్డర్లు బంద్జేసిన్రు. నేతన్నలను ఆత్మహత్యల బాటను పట్టించింది ఈ దివాళాకోరు కాంగ్రెస్ ప్రభుత్వమే. 2004 నుంచి 14 వరకు ఆత్మహత్యలు జరిగినయి. ఒకేవారంలో 9 మంది నేతన్నలు ప్రాణం తీసుకున్నరు. వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ, మేం రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెల ఇవ్వాలని నిర్ణయించి, అవి సిరిసిల్లలోనే తయారు చేయించి ఉపాధి చూపినం.
మూత పడ్డ సాంచాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి ఎనిమిది నెలల పాటు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వేలాది మంది కార్మికుల కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్. బతుకమ్మ చీరెలే కాకుండా స్కూల్ యూనిఫాంలు, కేసీఆర్ కిట్టులో ఇచ్చే చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు సిరిసిల్లలో తయారు చేయించినం. భవిష్యత్తులో ఆత్మహత్యలు జరుగవద్దన్న ఉద్దేశ్యంతో ఇచ్చిన మాటకు కట్టుబడి 3,312 కోట్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు సిరిసిల్లకు ఇచ్చినం. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతో సాంచాల్లో సంక్షోభం తొలగి ఆత్మహత్యలు ఆగిపోయినయి.
– సిరిసిల్లలో కేటీఆర్
అధికారులూ అత్యుత్సాహం వద్దు
సిరిసిల్లలో నేతన్నలే కాదు, అందరూ ఇబ్బంది పడుతున్నరు. ఇక్కడ ఓ విచిత్రమైన పరిస్థితి. అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నరు. మా ప్రభుత్వ హయాంలో చిన్నచిన్న పల్లెలను కొత్త గ్రామ పంచాయతీలు చేసి 54 రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసినం. దుకాణాలు పెట్టి స్థానికంగా ఉండే పొదుపు సంఘాల మహిళలకు బాధ్యతలు ఇచ్చినం. కొంత ఆదాయం వస్తున్న ఉద్దేశంతో ఇచ్చిన దుకాణాలను నాపై నాలుగుసార్లు ఓడిపోయిన వ్యక్తి, ఇక్కడ ప్రభుత్వాన్ని నేనే నడుపుతానంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కేకే మహేందర్‌రెడ్డికి అధికారులు వంత పాడుతూ ఆగమాగమైతున్నరు.
అధికారులకు నేనొక్కటే చెపుతున్న. మొన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లు సైతం సస్పెండ్ అయ్యిన్రు. చట్ట ప్రకారం కాకుండా, కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తమంటే మాత్రం తప్పకుండా ఫలితం అనుభవిస్తరు. చట్ట ప్రకారం పనిచేయండి. ఇష్టం వచ్చినట్లు చేస్తమంటే ఊరుకోం. మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు.. మళ్లీ మూడున్నర నాలుగేళ్లలో కేసీఆర్ తిరిగి వస్తరు.
– సిరిసిల్లలో కేటీఆర్