Putta Madhukar | మంథని, ఆగస్టు 18: నవాబులను ఓడించి తొలి బజన రాజ్యాన్ని స్థాపించిన బజన యుద్ధ వీరుడి సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ ఆయన వారసుడిగా గర్వపడుతున్నానని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత పెట్రోల్ పంపు ఏరియాలో మహానీయుల రస్తాలోని సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పుట్ట మధూకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం పుట్ట మధూకర్ మాట్లాడుతూ..375 ఏండ్ల క్రితమే సర్ధార్ సర్వాయి పాపన్న గొప్ప సందేశం ఇచ్చారన్నారు.
ఖిలాసాపూర్ కేంద్రంగా పోరాటాన్ని ప్రారంభించి గోల్కొండ ఖిలా ఎక్కి రాజుల పరిపాలనను అంతమొందించి ఏడు నెలలు రాజ్యం ఏలాడని గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. దేశంలో మహనీయుల చరిత్రను తెలియనీయకుండా కప్పి పుచ్చే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమం మూలంగానే అనేక మంది మహనీయుల చరిత్ర వెలుగులోకి వచ్చాయన్నారు. చాకలి ఐలమ్మ, కొమురంభీం, దొడ్డికొమురయ్య, సర్వాయి పాపన్నలాంటి మహనీయులను స్మరించుకోవడానికి ఉద్యమమే కారణమన్నారు. మహనీయుల స్పూర్తితో తెలంగాణ ఏలా సాధించుకున్నామో అదే స్ఫూర్తితో గోల్కొండ ఖిల్లాను సర్వాయి పాపన్న ఏలాడన్నారు. సర్వాయి పాపన్న వారసుడిగా మంథనిలో తాను బహుజనుల కోసమే ఆరాటపడుతున్నానని, సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన తాను మహనీయుల స్పూర్తితో ఎమ్మెల్యే అయి రాజులుగా చెలామణి అవుతున్న ఒక కుటుంబ కబంధ హస్తాల్లో నలిగిపోతు న్న మంథని నియోజకవర్గాన్ని మెలుకోల్పానన్నారు.
అయితే ఈ నియోజకవర్గంలో రాజ్యాంగం అర్థం కాకపోవడం, మహానీయుల చరిత్రను తెలుసుకోకపోవడం మూలంగా కేవలం నాలుగేండ్ల మూడ నెలల్లోనే అధికారం కోల్పోయామ న్నారు. ఇక్కడ మహనీయుల చరిత్రను తెలియకుండా చేస్తున్నారని, కేంద్రంలో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతుంటే ఇక్కడ మాత్రం రాజ్యాంగం ముట్టుకోవడం లేదన్నారు. రాజ్యాంగం అర్థం అయితే ఆ కుటుంబం పాలన సాగదనే ఆలోచనలో వారు ఉన్నారన్నారు. అసలు రాజ్యాంగం వచ్చేందే బహుజనుల కోసమని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసమని ఆయన వివరించారు. రాజ్యాంగం లేకపోవడం, స్వాతంత్య్రం రాకపోవడం మూలంగానే నాడు సర్వాయి పాపన్న గౌడ్ ఏడు నెలలే పాలన చేశారన్నారు. ఆతర్వాత ఆయనను ఎలా చంపేశారో అదే రీతిలో తనను అంతం చేయాలని ప్రస్తుతం కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు.
మహనీయుల చరిత్ర కంటే మా కుటుంబం చరిత్రపైనే చర్చ జరుగాలనే ఆలోచనలోకాంగ్రెస్ పార్టీ ఉందని, ఈ క్రమంలో తాను మహనీయుల వారసుడిగా ముందుకు వెళ్తేంటే కుట్రలు చేస్తున్నారన్నారు. నాలుగేండ్లు కాదని నలుబై ఏండ్లు అధికారంలో ఉండే దిశగా బహుజను లంతా ఆలోచన చేయాలన్నారు. సర్వాయి పాపన్న ఆశయాలను వందశాతం ముందుకు తీసుకెళ్తామని పుట్ట మధూకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ఎక్కటి ఆనంతరెడ్డి, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్‌యాదవ్, మంథని లక్ష్మణ్, గొబ్బూరి వంశీ, రవీందర్, వెల్పుల గట్టయ్య, ఆసీఫ్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.