Mini excavator | కోల్ సిటీ, జూన్ 19 : చారాణా కోడికి.. బారానా మసాలా అంటే ఇదే కాబోలు. రామగుండం నగర పాలక సంస్థ నూతనంగా కొనుగోలు చేసిన మినీ ఎక్స్కవేటర్ వాహనం విషయంలో ఇదే తరహా విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఎంత చెబితే అధికారులు అంత బిల్లు చెల్లింపులు చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులను కాంట్రాక్టర్లు మచ్చిక చేసుకొని ప్రతీ వాహనం కొనుగోలులో అంచనాలకు మించి వ్యయం చేస్తు బల్దియా ఖజానాకు గండి కొడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో అధికారుల పర్సంటేజీలు ఎంతనో తెలియదు కానీ… జేసీబీ-30 ప్లస్ కంపెనీకి చెందిన మినీ ఎక్స్కవేటర్ వాహనం కొనుగోలు చేయడానికి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.30లక్షలు ఖర్చు చేశారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. దాదాపు రూ.25 లక్షలు కూడా విలువ చేయని ఈ మినీ ఎక్స్కవేటర్ కు అంత భారీ వ్యయం చేయడం అవసరమా అని పలువురు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. గతంలోనే నూతన వాహనాలు కొనుగోలు చేసి కార్యాలయంకు రాకముందే బిల్లులు చెల్లించిన అభియోగం ఉంది. ఆ వ్యవహారంపై ఇప్పటికీ విజిలెన్స్ విచారణ జరుగుతోంది. కొన్ని వాహనాలు మాత్రం తుప్పు పట్టి కార్యాలయం వెనకాలే స్క్రాప్ గా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో మళ్లీ కొత్తగా మరో మినీ ఎక్స్కవేటర్ వాహనం కొనుగోలు నిమిత్తం రూ.30లక్షలు వెచ్చించడం కాంట్రాక్టర్ కు లబ్ధి చేకూర్చడానికేనా పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ రామన్ ను వివరణ కోరగా, వాస్తవానికి వాహనం విలువ దాదాపు రూ.25 లక్షల వరకు ఉంటుందనీ, జీఎస్టీ, ఇతర టాక్స్ లు కలిపి మొత్తం రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఏదిఏమైనా అధికారులను మాయ చేయడంలో మున్సిపల్ కాంట్రాక్టర్ల సిద్ధహస్తులు అనడంలో అతిశయోక్తి లేదు.