కలెక్టరేట్, జనవరి 8: మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్యంలో కూడా వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే స్వయం సహాయక సంఘాల ద్వారా అతివలకు ఆర్థికసాయమందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తుండగా, పలు కారణాల రీత్యా మలిదశలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూతనిచ్చేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా వారి కోసం ప్రత్యేక పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలంటూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులను ఆదేశించింది. జిల్లాల వారీగా 60 ఏళ్లు పైబడిన వారిని గుర్తించి గ్రూపులు ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సెర్ప్ సర్క్యులర్ జారీ చేసింది.
దీంతో గతంలో గ్రూపుల నుంచి తొలగించిన వారిని, ఇప్పటి వరకు గ్రూపుల్లో చేరని 60 ఏళ్లు పైబడిన మహిళలతో కొత్తగా స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది ముమ్మర చర్యలు చేపడుతున్నారు. గతంలో సంఘాల్లో సభ్యులై ఉండి సంఘాలకు బ్యాంకుల ద్వారా అందించే రుణాలతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ, కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ, ఆర్ధిక స్వావలంబన దిశగా సాగారు. అయితే, నిబంధనల మేరకు 58 ఏళ్లు నిండితే ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో ఉన్న వారిని తొలగిస్తుండగా, వారు ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మధ్య తరగతి కుటుంబాలే ఉండగా, వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం, ఇతర ప్రాంతాల్లో జీవనం సాగిస్తుండడం, ఇంటి పెద్ద లేక ఒంటరిగా ఉండడం, పెరిగిన నిత్యావసర ధరలు, వృద్ధాప్యంలో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు వెరసి నిత్యం ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనే నానుడికి అనుగుణంగా అరవై ఏళ్లు పైబడిన ఐదుగురు మహిళలను కలిపి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి, వారితో నెలనెలా కొంత మొత్తం పొదుపు చేయించేందుకు నిర్ణయించింది. రెండేళ్ల అనంతరం వారు జమ చేసిన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తం కలిపి, ఆ సంఘాల్లోని సభ్యులకు ఆపద సమయంలో సాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నది. అలాగే, దివ్యాంగులకు కూడా ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 80 నుంచి 90 వరకు దివ్యాంగ సంఘాలు ఉన్నా ఇంకా అనేక మంది దివ్యాంగ మహిళలు ఉన్నట్లు గుర్తించారు.
వారందరితో ఐదుగురికి ఒక గ్రూపు చొప్పున తయారు చేసేందుకు క్షేత్రస్థాయిలో ఐకేపీ ఏపీఎంలు, సీసీలు, సీవోలు నిమగ్నమయ్యారు. 18 ఏళ్లు పైబడిన వారితో ప్రస్తుతం స్వయం సహాయక సంఘాలు కొనసాగుతున్నాయి. వీటికి అదనంగా మరో రెండు రకాల సంఘాలకు ప్రభుత్వం జీవం పోస్తుండడంతో, తమకు ‘ఆసరా’గా మాత్రమే కాదు.. అన్నింటికి అండగా ఉంటామంటూ ప్రభుత్వం ముందుకురావడం పట్ల వయోవృద్ధులు, దివ్యాంగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లాలో సుమారు 12వేలకు పైగా అరవై ఏళ్లు నిండిన మహిళలు, దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది.
సంఘాల ఏర్పాటు ప్రారంభమైంది
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆరు పదులు నిండిన మహిళలకు, దివ్యాంగులకు వేర్వేరుగా కొత్త స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసే ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏపీఎంలు, సీసీలు అరవై ఏళ్లు నిండిన మహిళలు, దివ్యాంగులను గుర్తించడంలో నిమగ్నమయ్యారు. ఆసక్తి ఉన్న వారితో సంఘాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. బ్యాంకర్లు రుణ సాయం చేయకున్నా స్వయం శక్తితో సంఘాలను నిర్వహించుకునేలా వారిని చైతన్యవంతం చేసేందుకు కృషి చేస్తున్నం.
-ఎల్ శ్రీలతారెడ్డి, డీఆర్డీవో