Anganwadi Teacher Recruitment | కోల్ సిటీ, ఆగస్టు 20 : రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ ఆఖరి ఘట్టంకు చేరుకుంది. ఈ మేరకు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ జే అరుణ శ్రీ ఇంటర్వ్యూల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. పూర్తి పారదర్శకతతో నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. అనంతరం రామగుండం శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి అలేఖ్య పటేల్, సెలక్షన్ కమిటీ సభ్యులు ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేశారు. కాగా, రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు సెక్టార్ పరిధిలో ఖాళీగా ఉన్న ఎల్కలపల్లి – 1, 3, వేమనూరు, కుందనపల్లి అంగన్వాడీ కేంద్రాలకు టీచర్ల నియామకంకు గానూ గత జూన్ మాసంలో నోటిఫికేషన్ వెలువడగా నాలుగు పోస్టులకు మొత్తం 721 మంది ఔత్సాహిక మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.
జూలై 15న గోదావరిఖని విఠల్నగర్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సీడీపీఓ అలేఖ్య పర్యవేక్షణలో వారం రోజుల పాటు సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. నెలరోజుల అనంతరం నాలుగు పోస్టులకు 38 మంది అభ్యర్థులను అర్హులుగా నిర్ధారించారు. ఈమేరకు గురువారం నిర్దేశించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూల ఘట్టం ముగించారు. ఈ జాబితాను కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కాగా, రామగుండం సెక్టార్ పరిధిలో ఖాళీగా ఉన్న సుమారు 20 నుంచి 30 వరకు హెల్పర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు కూడా త్వరితగతిన నోటిఫికేషన్ జారీ చేయాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.