Urea | ఎల్లారెడ్డిపేట, ఆగస్టు, 20: నాట్లేసి నెల 15రోజులైనప్పటికీ వరిపొలానికి యూరియా వేయక పోవడంతో పొలాలు ఎరబడుతున్న సమయంలోనే తమ గ్రామానికి లారీ లోడు వచ్చిందని అందులో కొంత దింపి మిగతావి గంభీరావుపేటకు తీసుకెల్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వందలాదిగా చేరుకున్న రైతులు పూర్తి యూరియా ఇక్కడే దింపాలని లారీని నిలిపి వేసిన ఘటన బొప్పాపూర్‌లో జరిగింది. బుధవారం ఉదయం 10 గంటలకు హనుమాన్ ఆలయం వద్దకు లారీ లోడు వచ్చిందని తెలియడంతో సుమారు 5వందల మంది రైతులు అక్కడకు చేరుకున్నారు. లారీ లోడు 460 బస్తాలు ఉండగా అందులో నుంచి 240 బస్తాలు దింపి మిగతా బస్తాలను గంభీరావుపేటకు తీసుకెల్దామనుకున్నారు.
దీంతో అక్కడికి చేరుకున్న రైతులు 240 బస్తాలు తమకు సరిపోవని పూర్తి లోడు బొప్పాపూర్లోనే దింపాలని అప్పటి వరకు లారీని కదలనిచ్చే ప్రసక్తే లేదని రైతులు మండిపడ్డారు. లారీని నిలిపి వేయడంతో ఏవో రాజశేఖర్ మిగతా లోడు కచ్చితంగా గంభీరావుపేట పంపాల్సి ఉందని గురువారం మరో లోడు వస్తుందని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. సుమారు గంటన్నర సేపు లారీ అక్కడే నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు సీఐ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో అక్కడకు చేరుకున్నారు. అంతలోనే ఏఎంసీ చైర్మన్ సాబెరా బేగం భర్త గౌస్ రైతులను రెచ్చగొడుతున్నారంటూ అక్కడున్న ఇద్దరు నాయకులతో పరుషంగా మాట్లాడారు.
దీంతో బీఆర్ఎస్ నాయలు ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి, ల్యాగల సతీష్‌రెడ్డి రైతులతో కలిసి యూరియా కావాలని అడిగితే రెచ్చగొడుతున్నారంటూ మాట్లాడటం సరికాదని గౌస్‌తో గొడవకు దిగారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురిని శాంతింపజేసి అధికారులతో మాట్లాడారు. గురువారం యూరియా వచ్చేలా చూడాలని వ్యవసాయాధికారులతో మాట్లాడిన పిదప, ఏవో హామీ ఇచ్చిన పిదప రైతులు పట్టు వీడారు. అనంతరం ఉదయం 11.45 గంటలకు లోడుతో ఉన్న లారీని రైతులు అక్కడ నుంచి వెల్లనిచ్చారు.