Raikal | రాయికల్, సెప్టెంబర్10 : రైతులకు ప్రకటించిన విద్యుత్ సరఫరాలో కోతలు విధించడాన్ని నిరసిస్తూ పలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు గురువారం రాయికల్ పట్టణంలో ఆందోళనకు దిగారు. పట్టణంలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట ఉన్న జగిత్యాల-రాయికల్ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ కోతల కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలిపోయిన విద్యుత్ మోటార్లను రహదారిపై ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వ్యవసాయానికి కనీసం 12 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు పునరుద్ధరిస్తారో రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సుధీర్‌రావు, విద్యుత్ శాఖ జగిత్యాల రూరల్ ఏడీఈ సింధూర శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ నెల 20లోగా సమస్యలను పరిష్కరించాలని రైతులు విద్యుత్ అధికారులను కోరారు. అప్పటిలోగా సమస్యలు పరిష్కారం కాకపోతే రహదారిపై వంటావార్పు తదితర కార్యక్రమాలు చేపట్టి ఆందోళనను ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.