ఇతర జిల్లాలో అండర్‌టేకింగ్‌కు అనుమతి ఇచ్చిన సర్కారు.. కేవలం సిరిసిల్లలోనే ఇవ్వకపోవడంతో రైస్‌మిల్లర్ల ధాన్యం దింపుకోవడం లేదు. బ్యాంకు గ్యారెంటీ పేరిట ఆంక్షలు విధిస్తుండడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నది. గ్యారెంటీలు లేకపోవడంతో తూకం వేసిన ధాన్యాన్ని గోదాములకు తరలిస్తుండగా, అక్కడ హమాలీలు లేక అన్లోడింగ్ ఆలస్యమవుతున్న ది. దీంతో రోజుల తరబడి లారీలు నిలిచిపోతుండగా, డ్రైవర్లతోపాటు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్నదాతలు తమ వడ్లు దళారులకే అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 25 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అధునాతన, ఎక్కువ సామర్థ్యంగల పారాబాయిల్డ్ రైస్‌మిల్లులు రాజన్న సిరిసిల్లలోనే ఎక్కువగా 38 ఉన్నాయి. ఒక్కో మిల్లు 40 టన్నుల నుంచి 80టన్నుల సామర్థ్యం ఉన్నాయి. అయితే అధికారులు రైస్‌మిల్లు సామర్థ్యంలో 10శాతం గ్యా రెంటీ అడగ్గా, గోడౌన్ కెపాసిటీలో శక్తిమేరకు దింపుకొనేందుకు బ్యాంకు గ్యారెంటీ ఇస్తామని మిల్లర్లు చెబుతున్నా అధికారులు అందుకు ఒప్పుకోవడం లేదు. కొద్దిరోజులుగా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు మిగతా జిల్లాల మాదిరిగా అండర్ టేకింగ్ తీసుకుని బ్యాంకు గ్యారెంటీకి అనుమతి కోసం అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు బ్యాంకు గ్యారెంటీ క్యాష్ రూపంలో ఇస్తే వారం పట్టొచ్చని.. ప్రాపర్టీ చూపిస్తే కనీసం 20రోజులు పడుతుందని చెబుతున్నారు. పూర్తి కెపాసిటీలో 10శాతం గ్యారెంటీ ఇవ్వాల్సిందేనని అధికారులు చెప్పడంతో మిల్లుల్లో ధాన్యం దింపుకొనేందుకు మిల్లర్లు వెనక్కితగ్గారు. దీంతో జిల్లాలో ధాన్యం కొనుగోల్లు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జిల్లాలోని పలు ప్రభుత్వ గోదాములు, ఇతర అవకాశాలను ఉపయోగించుకుంటే మొత్తంగా దాదాపు 60వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల స్టోర్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. గత సీజన్ అంచనాను బట్టి ఈ సీజన్లో కూడా 2.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉండగా, ఇంత మొత్తం ధాన్యం నిల్వచేసే అవకాశాలపై అనుమానాలు వ్య క్తం అవుతున్నాయి. గత సీజన్లో ధాన్యం సేకరణకు నెల స మయం పట్టినట్లు రైస్‌మిల్లర్స్ చెబుతుండగా, ఇప్పటికీ 12 రైస్ మిల్లులకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీలు సమర్పించగా మిగతా రైస్‌మిల్లుల యజమానులు గ్యారెంటీలు సమర్పించలేదని తెలిసింది.
అలాంటిది కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొద్దిపాటి గోదాముల్లో తక్కువ మంది హమాలీల తో అన్లోడ్ చేసేందుకు ఎంతకాలం పడుతుందని రైతుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వడ్లు లారీలు లేక సెంటర్లలోనే ఉంచారు. లోడ్ చేసిన లారీలు అన్లోడ్కు వెళ్దామనుకుంటే ఇప్పటికే సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ సర్దాపూర్‌లో గోదాం నిండిపోవడంతో బొప్పాపూర్‌కు తరలిస్తున్నారు. అక్కడ హమాలీలు లేక ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. పది శా తం డిపాజిట్ ఎక్కువ మంది మిల్లర్లు చెల్లించక మిల్లులు అలాట్ కాకపోవడంతో కాంటాపెట్టిన వడ్లుసైతం లారీలు తీ సుకెళ్లేందుకు ఆలస్యమవుతున్నది. ఇదంతా గమనిస్తున్న రై తులు వర్ష భయంతో తాము పండించిన ధాన్యాన్ని దళారీలకు అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదనగా చెబుతున్నారు.
ఇతర జిల్లాల మాదిరిగా మాకు బ్యాంకు గ్యారెంటీ విషయంలో అండర్‌టేకింగ్ అవకాశమిస్తే ధాన్యం దించుకుం టాం. ఒక్కసారిగా 10శాతం క్యాష్ డిపాజిట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంత సమయమిస్తే మేము బ్యాంకు గ్యారెంటీ డిపాజిట్ చెల్లిస్తాం. మరోసారి కలెక్టర్ సార్‌ను కలిసి అడుగాలని అనుకుంటున్నాం.
– చేపూరి నాగరాజు, అధ్యక్షుడు రైస్‌మిల్లర్స్ అసోషియేషన్ (సిరిసిల్ల)
సొసైటోళ్లు వడ్లు కొంటలేరు. ఐకేపోళ్లు ఇబ్బందిపెడుతున్రు. వడ్లు ఎండవోసి 20రోజులైంది. వర్షానికి నానితే మల్ల ఎండబోసిన. సెంటర్ల అమ్ముదామంటే సర్దాపూర్కాడ లారీలు బాగా ఉన్నయంటుర్రు. మా దగ్గర నింపిన లారీ రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నది. అదెప్పుడు ఖాళీ అయితదో.. మల్ల ఎప్పుడత్తదో తెలువది. ఇగ మా వడ్లు ఎప్పుడు కొంటరో.. ఓ పక్క మొగులుగావట్టె. రోజు ఈడనే కావలి ఉండుడు అయితాంది. మల్ల వానొస్తే ఎట్లని ఏడికయితే గాడికని రూ.1,800చొప్పున ప్రైవేటోళ్లకు 300బస్తాలు అమ్మిన.
– కాస రాజేశం, రైతు (రాగట్లపల్లి)
వడ్లు జోకినంక జెల్దిజెల్ది తీస్కపోతే ఇబ్బంది ఉండది. జోకిన వడ్లే సరిగ ఇక్కడి నుంచి పోతలెవు. మొగులు గావట్టె వడ్లు నానిపోతె మల్లమల్ల ఎండబోసుడు తిప్పలైతది. నాకు మూడెకరాలాల్ల పంటేస్తె రోగంబడి పంటంత కరాబైంది. 150 బస్తాలచ్చినయ్ దీని కోసం కేంద్రంల పోసి తిప్పలు పడేదానికంటే బయటమ్మిందే నయమని ప్రైవేటోళ్లకు అమ్మిన
– నెత్తెట్ల జీవన్, రైతు (రాగట్లపల్లి)
నేను వెంకటాపూర్ ఐకేపీ కేంద్రం నుంచి మూడు రోజుల కింద బొప్పాపూర్ గోదాముకు వడ్లు తెచ్చిన ఇప్పటికింకా దించుతలేరు. మిల్లులకు అలాట్ చేసినా బాగుంటుండె. ఇక్కడ తాగెతందుకు నీల్లుగూడ లెవ్వు తెచ్చుకుందామన్న గొల్లపల్లి బస్టాండు పోవాలె ఏమన్న తిందామన్న అక్కడికే పోవాలె. బాగ ఇబ్బందైతుంది.
-మద్దెల నరేశ్, డ్రైవర్ (వెంకటాపూర్)