9వేల కుటుంబాలకు రైతు బీమా
కారణం ఏదైనా కావొచ్చు రైతు మరణిస్తే ఆ కుటుంబం అనాథ కావొద్దు. ఆ కుటుంబానికి అండగా నిలువాల్సిన బాధ్యత మనపై ఉన్నది. అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతు మరణించిన 10 రోజుల్లో ఆ ఇంటికి రూ. 5 లక్షల చెక్కు వస్తుంది.
- ఐదేండ్లలో 454.40 కోట్ల పరిహారం
- అన్నదాత కుటుంబాలకు భరోసాగా పథకం
- పైసా ఖర్చు లేకుండా బీమా పాలసీ
- రైతు ఎలా చనిపోయినా ఆర్థిక సాయం
- బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం
- ఆగమైన బతుకులకు ధీమానిస్తున్న రాష్ట్ర సర్కారు
- ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు
కారణం ఏదైనా కావొచ్చు రైతు మరణిస్తే ఆ కుటుంబం అనాథ కావొద్దు. ఆ కుటుంబానికి అండగా నిలువాల్సిన బాధ్యత మనపై ఉన్నది. అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతు మరణించిన 10 రోజుల్లో ఆ ఇంటికి రూ. 5 లక్షల చెక్కు వస్తుంది. నా జీవితంలో నేను చేసిన అత్యంత గొప్ప పనిగా దీనిని భావిస్తున్నా
– రైతు బీమా ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
గత ప్రభుత్వాలకు రైతులంటే చిన్నచూపు. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు కనీస ప్రోత్సాహం ఉండేది కాదు. అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నా.. లేదంటే ఏదైనా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా కుటుంబాలకు ఎలాంటి భరోసా ఉండకపోయేది. ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డునపడ్డా కనీస సాయం అందేది కాదు. పిల్లలు చదువులను మధ్యలోనే ఆపేసినా చేయూత ఉండేది కాదు. కానీ, నేడు ఇంటి పెద్దదిక్కైన రైతు ఎలా మరణించినా.. ఆ కుటుంబానికి రాష్ట్ర సర్కారు ధీమానిస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ‘రైతు బీమా’ కొండంత అండగా నిలుస్తున్నది. 2018 ఆగస్టులో ప్రవేశ పెట్టిన ఈ పథకం కింద ఐదేళ్లలో 9,088 కుటుంబాలకు 454.40 కోట్ల పరిహారం అందగా, ఆయా కుటుంబాలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయిన బాధ తీర్చలేనిదే అయినా.. ఆపద సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తున్న తీరును కొనియాడుతున్నాయి.
– కరీంనగర్, మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ)
గంగారాం ఇంటికి ధీమా
‘రైతు బీమా పథకం కింద ఐదు లక్షలు వచ్చినయ్. వాటితో నా పెనిమిటి సావు ఖర్చుతోపాటు బాకీలు కట్టుకున్నం. అవి అచ్చెపటికే నలుగురిలో తలెత్తుకుంటున్నం’ అని చెబుతున్నది జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన కోరుట్ల గంగనర్సు. ఈమెది మత్స్యకార కుటుంబం. భర్త గంగారాం (47). ఆయన పేరిట ముప్పై గుంటల ఎవుసం భూమి ఉన్నది. గంగరాం చేపలు పట్టే వృత్తితోపాటు వ్యవసాయం చేసేవాడు. వీరికి ముగ్గురు కొడుకులు. వీరి చదువుల కోసం 4 లక్షల వరకు అప్పులు చేశారు. పెద్ద కొడుకు గంగాధర్‌ను ఎమ్మెస్సీ, మిగిలిన ఇద్దరు కొడుకులను డిగ్రీ వరకు చదివించారు. అంతలోనే గంగారాం హఠాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. 2019 మార్చి 11న పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి తిరిగి వస్తూ, చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం ఓవైపు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది.
మరోవైపు చేతిలో పైసల్లేక కర్మకాండలు ఎలా చేయాలని బాధపడ్డది. వారం వ్యవధిలోనే గంగారాంకు నామినీగా ఉన్న ఆయన చిన్న కొడుకు గంగ శేఖర్ ఖాతాలో రైతు బీమా కింద ఐదు లక్షల రూపాయలు జమయ్యాయి. అందులోంచి లక్ష తీసి గంగారం పెద్దకర్మతోపాటు ఇతర ఖర్చులకు వినియోగించారు. మిగతా నాలుగు లక్షలతో అప్పులను తీర్చారు. ‘మా తండ్రి చనిపోవడం బాధాకరం. అయినా ఈ పరిస్థితుల్లో మాకు రైతుబీమా డబ్బులు రావడం ధైర్యాన్నిచ్చింది. ఈరోజు ఆత్మగౌరవంతో నలుగురిలో తలెత్తుకొని బతుకుతున్నమంటే దానికి రైతు బీమానే కారణం’ అని కొడుకు గంగాధర్ చెబుతున్నాడు. తమలాంటి ఎందరో రైతులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు రైతులోకం రుణపడి ఉంటదంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాడు.
నాడు రైతుల ప్రాణాలకు విలువ ఉండేది కాదు. అప్పుల బాధతోనో, ప్రమాదాలతోనో, లేదంటే అనారోగ్యంతోనో.. ఎలా చనిపోయినా బాధిత కుటుంబాలకు కనీసం సాయం అందేది కాదు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయి రోడ్డునపడ్డా భరోసా ఇచ్చే దిక్కు లేదు. ఉద్యమ సమయంలో రైతుల కష్టాలను కండ్లారా చూసిన కేసీఆర్, స్వరాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు. వినూత్న పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే కాదు, రైతుకు అన్ని విధాలా భరోసాగా నిలుస్తున్నారు. రైతు ఎలా చనిపోయినా కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ‘రైతు బీమా’ పథకాన్ని తెచ్చారు. ఏటా రైతులపై భారం పడకుండా ప్రీమియం చెల్లిస్తూ, 2018 నుంచి విజయవంతంగా అమలు చేస్తూ అండగా నిలుస్తున్నారు.
– కరీంనగర్, మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ)
మా ఇంటి అప్పులు తీరినయ్..
మా నాన్న దేవయ్య 2022ల చనిపోయిండు. నాకు ఒక చెల్లె సంధ్య. నాన్న పేరు మీద ఎకరన్నర వ్యవసాయ భూమి ఉండేది. ఒక వైపు మా భూమి సాగు చేయడంతో పాటు మరికొంత కౌలుకు కూడా తీసుకుని సాగు చేసేది. మాకు చానా అప్పులుండేవి. నాన్న చనిపోయినంక రెండు నెలలకే ప్రభుత్వం నుంచి 5 లక్షల రైతు బీమా డబ్బులు అమ్మ ఖాతాలో జమైనయ్. దాంతోటి మా కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీరినయ్. 20 రోజుల కిందట చెల్లె పెండ్లి చేసినం. పెండ్లికి కూడా రైతు బీమా డబ్బులు ఉపయోగపడ్డయ్. నాన్న చనిపోవడం తట్టుకోలేకపోయినం. మా ఇంట్లో చానా రోజులు ఆ దిగాలే ఉండేది. కుటుంబం బాగా కుదేలైంది. పెద్ద దిక్కును కోల్పోయి ఏ ఆధారం లేకుంటయ్యింది. కానీ, అమ్మ ధైర్యంగా మమ్ముల ముందుకు నడిపించింది. అమ్మ వంద రోజుల పనికి వెళ్లడంతోపాటుగా కూలీ పని చేస్తున్నది. ఆమె కష్టం మీదనే బతుకుతున్నం. రైతు బీమా ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్న సీఎం కేసీఆర్ సారుకు మా కృతజ్ఞతలు.
– సిరాలపు రవికుమార్(రైతు దేవయ్య కొడుకు), మూలాసాల (పెద్దపల్లి మండలం)
మా కుటుంబానికి గంజిపోసినయ్
మేం ముగ్గురు పిల్లలతోటి అరిగోసపడుతూ బతుకుతున్నం. అంతలోనే మా ఆయన హఠాత్తుగా కాలం చేసిండు. ఆయన కర్మ ఎట్ల జేసుడు? అన్న రందిపడ్డం. మళ్ల బాకీ తెద్దాం అనుకున్న. అప్పటికే నాలుగు లచ్చల అప్పుడు ఉండె. కానీ, దిన వారం కాకముందే ఐదు లక్షలు అచ్చినయ్. సర్పంచ్ అచ్చి పైసలు ఖాతాల జమైనయి అని చెప్పిండు. దాంతోటి ఊపిరి పీల్చుకున్నం. ఆ పైసలల్లకెల్లి లచ్చ రూపాయలు తీసి దినవారం చేసినం. నెల రోజులల్ల నాలుగు లచ్చల బాకీలు కట్టేసినం. ఇప్పుడు బాకీ లేకుండా వోయింది. రైతుబీమా కింద అచ్చిన ఐదు లక్షలు మా కుటుంబానికి గంజి పోసినయ్. రైతుల బాధలు తీర్చేందుకు పూనుకున్న సీఎం కేసీఆర్ కడుపు సల్లగా ఉండాలె.
– కోరుట్ల గంగ నర్సు, చల్గల్
మమ్మల్ని ఆదుకున్నది
మా అమ్మపేరు కనుక. మాది పేద కుటుంబం. నాన్న గడ్డం మల్లయ్య ఎవుసంతోపాటు కూలీ పని చేస్తుండె. నాకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లె. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు నాన్నే జేసిండు. నా పెళ్లి కూడా చేసినంక 2021లో నాన్న చనిపోయిండు. ఒక్కసారిగా మాపై పిడుగుపడ్డట్టయింది. అమ్మా, అక్కలు, చెల్లె మేం షాక్‌కు గురైనం. పెళ్లిళ్లతో చాన అప్పులు ఉండే. మాకున్నదే ముప్పై గుంటల ఎవుసం భూమి. నాన్న జరిగిపోయిన తర్వాత మా కుటుంబానికి 5లక్షల రైతు బీమా వచ్చింది. దాంతోటి చెల్లె పెళ్లి చేసిన. అప్పులు కట్టిన. మా కుటుంబాన్ని రైతు బీమా మంచిగ ఆదుకున్నది. నా బాధ, అమ్మ బాధ మొత్తం తీరింది. ముప్పై గుంటల భూమికే రైతు బీమా వస్తదని నేననుకోలె. సీఎం కేసీఆర్ సారుకు మా కుటుంబం రుణపడి ఉంటది.
-గడ్డం శేఖర్ ప్రైవేట్ ఉద్యోగి, లక్కేపూర్ (మంథని మండలం)
బీమా రాకుంటే అప్పులపాలయ్యేది
మా నాన్న పేరుమీద చొప్పదండి శివారులోనే 3.36 ఎకరాలు ఉండేది. నాన్నకు కాళ్లు, చేతులు పడిపోయి, తలలో బ్లడ్ క్లాట్ కావడంతో చికిత్స పొందుతూ చివరికి 2022 సెప్టెంబర్ 29న చనిపోయిండు. ఆయన ఆరోగ్యానికే రూ.10 లక్షల వరకు ఖర్చు చేశాం. రైతు బీమా పథకంలో నన్నే నామినీగా చేర్చారు. నాన్న చనిపోయిన పది రోజుల్లో రూ.5 లక్షల చెక్కు వచ్చింది. మా తమ్ముడు సతీశ్ నేను నిర్ణయించుకున్న ప్రకారం నాన్న కోసం చేసిన అప్పులన్నీ తీర్చినం. రైతు బీమా రాకుంటే నేను మా తమ్ముడు అప్పుల పాలయ్యేవాళ్లం. ఇంత భూమి కూడా అమ్ముకోవాల్సి వచ్చేది. ఇది ఎంతో గొప్ప పథకం. తెలంగాణ రాక ముందు రైతుల పరిస్థితి ఎట్లున్నదో నేను కండ్ల నిండా చూసిన. నీళ్లు లేక, వ్యవసాయం చేయలేక రైతులు అప్పులు చేసెటోళ్లు.
అవి తీర్చడానికి భూములు అమ్ముకునెటోళ్లు. లేకుంటే ఆత్మహత్యలు చేసుకునెటోళ్లు. ఇట్ల చనిపోయిన రైతుల కుటుంబాలు దారుణంగా దెబ్బతిన్నయి. ఇంటికి పెద్ద దిక్కు పోయినంక చేసెటోళ్లు లేక భూములు పడావుపడ్డయి. చదువుకునే పిల్లలు మధ్యలనే చదువు ఆపేసి పనులు చేసుకుంటున్నరు. వాళ్ల భవిష్యత్తు పాడై పోయింది. ఇప్పుడు అట్ల కాకుండా కేసీఆర్ అండగా నిలుస్తున్నరు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నడు. పెట్టుబడికి ఎకరానికి పదివేలు ఇస్తున్నరు. ఏ కారణం చేతనైనా చనిపోతే రైతు బీమా ఇచ్చి ఆదుకుంటున్నరు. సీఎం కేసీఆర్ మాకు ఎంతో ధీమా, నమ్మకం. బీమా వచ్చింది కాబట్టి బతికి పోయాం. ఇంత కంటే ఒక సామాన్య రైతు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటడు.
నాడు కనీస సాయం కరువు
నాడు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయరంగంపై చిన్నచూపు ఉండేది. రైతులపై వివక్ష కొనసాగేది. విత్తనాలు, ఎరువులు, రుణాలు, పంటలకు గిట్టుబాటు ధర ఇలా అన్నింటా సహకారం ఉండేది కాదు. ఆఖరికి పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతు ఆత్మహత్య చేసుకున్నా, పట్టించుకునేవారు కాదు. ప్రభుత్వ పరంగా వచ్చే అరకొర సాయం కూడా అందించే వారు కాదు. ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడ్డా ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఉండేది కాదు. పునరావాస ప్యాకేజీ కింద లక్ష, అప్పులు తీర్చేందుకు మరో 50 వేలు అందజేయాల్సి ఉన్నా, ఏ ఒక్కరికీ అం దించేవారు కాదు. అప్పట్లో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా విడుదల చేసిన 421 జీవో అమలుపై నిర్లక్ష్యం కొనసాగేది. రైతు గురించి 13 రకాల నివేదికలను తయారు చేయాల్సిన అధికారులు, క్షేత్రస్థాయికి వెళ్లేవారు కాదు. విచారణ పేరిట కాలయాపన జరిగేది. అప్పుల బాధతో కాకుండా ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలు ఇవ్వడంతో న్యాయం జరిగేది కాదు. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏ సాయం అందక ఆగమయ్యాయి.
నేడు కొండంత అండ
నాడు ఉద్యమ నేతగా రైతుల కష్టాలను దగ్గరుండి చూసిన కేసీఆర్, స్వరాష్ట్రంలో అన్నదాత కన్నీళ్లు తుడవమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అధికారంలోకి వచ్చీరాగానే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాడు అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలకు ఇచ్చే 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను 6 లక్షలకు పెంచారు. అంతే కాకుండా జీవో నంబర్ 421 ప్రకారం 1.50 లక్షలు పొందిన కుటుంబాలకు మిగిలిన 4.50 లక్షలు అందించి సీఎం కేసీఆర్ తన ఉదారత చాటుకున్నారు. అయితే ఒక్క ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకే కాకుండా, అసలు రైతు ఎలా చనిపోయినా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని భావించారు. అందులో భాగంగానే దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ‘రైతు బీమా’ పథకాన్ని తెచ్చారు.
ధీమాగా బతుకుతున్న
నా భర్త పేరు బోయిని వెంకటేశం. ఆయన పేరు మీద ఎకరం పావు భూమి ఉండె. ఆయన బతికున్నప్పుడు కూరగాయలు సాగు చేసినం. మాకు ఒక కొడుకు అజయ్, ఇద్దరు కూతుళ్లు కవలలు రేణుక, రేవతి ఉన్నరు. నా భర్తకు ఆరోగ్యం బాగా లేకుంటే దవాఖాన్ల చుట్టూ తిరిగినం. 15 లక్షల దాకా ఖర్చయినయ్. ఉన్న ఎకరం పావు భూమి కుదవ పెట్టి అప్పుతెచ్చినం. అయినా భర్త నాకు దక్కలేదు. నా చిన్నతనంలోనే నాకు తల్లిదండ్రులు దూరమైన్రు. పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టినంక భర్త దూరమైండు. ఆయన పోయినంక రైతు బీమా కింద 5 లక్షల బీమా పైసలు వచ్చినయని మాఊరి సర్పంచ్ వచ్చి చెప్పిండు. పైసలు కూడ నా పేరున బ్యాంకులో పడ్డయన్నరు. ఖాతా బుక్కు పట్టుకుని బ్యాంకులకు పోయి సార్లను అడిగితే 5 లక్షలు ఉన్నయని చెప్పిన్రు. సర్కారు ఇచ్చిన పైసలతోని ధీమాగా బతుకుతున్న. పిల్లలను మంచిగా పోషించుకుంటున్న.
– బోయిని రమ్య, పెద్దూరు గ్రామం (సిరిసిల్ల అర్బన్ మండలం)
ఎలా చనిపోయినా సాయం
రాష్ట్ర సర్కారు రైతు బీమా అమలు కోసం ఎల్ఐసీని బీమా సంస్థగా ఎంపిక చేసింది. రైతులపై భారం పడకుండా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఏటా రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కోట్ల నుంచి 1500 కోట్లు కడుతున్నది. ఏయేటికాయేడు రైతు వాటా ప్రీమియం పెరుగుతున్నా వెనుకంజ వేయడం లేదు. 2018 ఆగస్టు 14న రైతు బీమా పథకం ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నది. బీమా సంస్థల నిబంధనల ప్రకారం జనరల్ ఇన్సూరెన్స్ కింద 18-59 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరికీ బీమా వర్తింపజేస్తున్నది. రైతులు ఎలా మరణించినా సదరు రైతు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నది. దేశ చరిత్రలో కొత్తగా అమలు చేస్తున్న ఈ బీమా పథకం లక్షలాది కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నది.
గుంట భూమి ఉన్నా ధీమా
రైతు బీమా పథకం ద్వారా వీలైనంత ఎక్కువ మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరేలా అత్యంత సరళమైన నిబంధనలను రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు గుంట (120 గజాలు) భూమి తన పేరుపై ఉండి పాస్ పుస్తకం ఉన్న రైతుకు కూడా ఈ పథకం వర్తించేలా నిబంధనలు రూపొందించారు. తద్వారా మెజార్టీ రైతులకు ఈ పథకం ద్వారా భరోసా లభిస్తున్నది. ఇలా ఉమ్మడి జిల్లాలో ఎన్నో కుటుంబాలకు ధీమా దొరికింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

