సానుభూతి కోసం పాకులాట
ఉపాధ్యాయ, ఉద్యోగులకు మద్దతు పేరిట కొత్త నాటకం
కరీంనగర్ కేంద్రంగా జాగరణ పేరుతో రణరంగం సృష్టించే ప్రయత్నం
ఉపాధ్యాయ సంఘాల అంగీకారం మేరకు జీవో జారీ
అనుమతి తీసుకోకుండానే యాగీ చేసే ప్రయత్నం
కేంద్రం నిబంధనలు ఉల్లంఘన
మా సమస్యను మేం పరిష్కరించుకోగలం : ఉపాధ్యాయ సంఘాలు
రాజకీయ లబ్ధికోసమే : ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
టీచర్ల బదిలీల జీవో 317పై తొండి రాజకీయం
కరీంనగర్, జనవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్త డ్రామాకు తెరలేపారు. ఈసారి ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను తన రాజకీయ చట్రంలో ఇరికించి సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. కేంద్రం ఇచ్చిన కొవిడ్ నిబంధనలను కాలరాసి ఆదివారం రాత్రి కరీంనగర్లో జాగరణ పేరిట రణరంగాన్ని సృష్టించే కుట్ర పన్నారు. పోలీసుల రంగప్రవేశంతో భంగపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలు, ఉన్నత న్యాయ స్థానాల ఆదేశాల ప్రకారం కొవిడ్ నిబంధనలు అతిక్ర మించి దీక్ష చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. కాగా, బండి తీరుపై సొంత పార్టీ శ్రేణులు, ఉపాధ్యాయసంఘాలు సైతం భగ్గుమన్నాయి. సమస్యలుం టే తమకు పరిష్కరించుకునే సత్తా ఉందని, తమకోసం జాగరణ చేయాల్సిన అవసరం లేదని పలు ఉపాధ్యాయ సంఘాలు తేల్చిచెప్పగా, పోలీసుల చర్యలను మంత్రి గంగుల అభినందించారు. ఇకనైనా దొంగదీక్షలు మానుకోవాలని పలువురు హితవుపలికారు.
బండి సంజయ్ మరోసారి కొత్త డ్రామాకు తెరలేపారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో వివిధ వర్గాలను ముందు పెట్టి డ్రామాలు చేయగా ఈసారి మాత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను తన చట్రంలోకి లాగేందుకు ప్రయత్నం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయులను జిల్లాల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లోని తన ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపడుతున్నట్లుగా 24 గంటల ముందే ప్రకటించారు. ఆ మేరకు పార్టీ శ్రేణులు కదిలిరావాలని పిలుపునిచ్చారు. నిజానికి ప్రస్తుతం కొవిడ్ పెరుగుతోంది. ఒమిక్రాన్ విజృంభిస్తున్నదని ఈ క్రమంలో ఎక్కువ మంది గుమిగూడడం, ధర్నాలు, ర్యాలీల వంటి కార్యక్రమాలు ముందస్తు అనుమతి లేకుండా చేయరాదని స్వయంగా కేంద్రం అన్ని రాష్ర్టాలకు హెచ్చరికలు జారీచేసింది. కానీ, ఇవేవీ పట్టనట్లుగా బండి వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల సమస్యను పరిష్కరించాలని భావిస్తే ఒక ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడిగా ముందుగా సదరు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. లేదా లేఖ రాయాలి. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే.. ఏవైనా కార్యక్రమాలు చేపట్టాలి. కానీ, అవేవీ లేకుండానే జాగరణ పేరిట రాత్రంతా రణరంగం చేసేందుకు ఆయన కుట్ర పన్నారన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు జాగరణ చేస్తున్నట్లుగా ముందస్తుగానే ప్రకటించినప్పుడు ఆమేరకు పోలీసుల అనుమతి ఎందుకు తీసుకోలేదన్నదానిపై ఆయన వద్ద సమాధానం లేదు. అంతేకాదు ఈ సమస్య రాష్ట్రస్థాయిది అయినప్పుడు.. కరీంనగర్లో జాగరణ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఇక్కడ శ్రేణులను రెచ్చగొట్టి సానుభూతి పొందాలన్న ప్రయత్నమే ఇందులో అధికంగా కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కార్యకర్తలు తప్ప ఉద్యోగులు ఏరి?
ఈ ఎపిసోడ్ మొత్తం పరిశీలిస్తే బండి సంజయ్ మరోసారి దొంగ దీక్షకు పూనుకున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఆయన చేపట్టిన దీక్షకు తన పార్టీ కార్యకర్తలు, నాయకులు తప్ప ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎవరూ కనిపించకపోవడం ఇందుకు నిదర్శనం. ఒకరిద్దరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తప్ప దీక్షా స్థలిలో ఉపాధ్యాయ, ఉద్యోగులు ఎవరూ కనిపించలేదు. ఈ దీక్ష చేపట్టే నాలుగు రోజుల ముందే బండి తన అనుచరగణంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులతో చర్చలు జరిపిన సందర్భంగా కూడా ఆ వర్గాల నుంచి పెద్దగా స్పందన రాలేదు. నిజానికి తమతో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను తెచ్చిందనే అభిప్రాయం ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉద్యోగుల బదిలీల్లో చిచ్చు పెట్టి, సమస్య సృష్టించి రాజకీయంగా వాడుకోవాలని చూడడం, అనుమతి లేకుండా దీక్షకు దిగడం, చివరికి పోలీసుల చేతిలో భంగపడడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అంతే కాకుండా, బండి సంజయ్‌తో పాటు చాలా మంది నాయకులు, కార్యకర్తలు మాస్కులు పెట్టుకోకుండానే దీక్షాస్థలం వద్ద సంచరించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.
మా సమస్యను మేం పరిష్కరించుకోగలం
ఉపాధ్యాయ సంఘాల అంగీకారం మేరకు జారీ అయిన 317 జీవోలో ఏమైనా సమస్యలుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే సత్తా ఉపాధ్యాయ సంఘాలకు ఉందని, ఉపాధ్యాయులను రాజకీయాల్లోకి లాగవద్దని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, వేణుగోపాల్‌రావు హితవుపలికారు. గుర్తింపు పొందిన ఎనిమిది సంఘాల అంగీకారం మేరకు జీవో జారీ అయిన మాట వాస్తవమన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఈ విషయంలో ముందుగానే చర్చించిందని చెప్పారు.
పోలీసులకు మంత్రి గంగుల అభినందనలు
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా బండి సంజయ్ జాగరణ పేరుతో డ్రామాలు చేయడం మంచి పద్ధతి కాదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకొని పోయిందని, పోలీసుల చర్యలను అభినందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన బండి సంజయ్ ముందుగా సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ లబ్ధికోసమే తప్ప సమస్య పరిష్కరించాలన్న ఉద్దేశం ఇందులో ఎక్కడా కనిపించడం లేదన్నారు.
రాజకీయ లబ్ధికోసమే: ఎమ్మెల్యే సుంకె
బండి సంజయ్ జాగరణ విషయంలో ఎక్కడ చూసినా రాజకీయ లబ్ధి కనిపిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. 317 జీవో విషయంలో ప్రభుత్వం ముందుగానే ఉపాధ్యాయ సంఘాలను పిలిచి మాట్లాడిన విషయం తెలుసుకోకుండా ఇలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇక ముందైనా బండి ఈ డ్రామాలను ఆపాలన్నారు.
కరోనా నిబంధనలు పట్టవా?
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. సభలు, సమావేశాలు, వేడుకలు నిర్వహించరాదని ఉన్నత న్యాయస్థానాలూ ఆదేశించాయి. కానీ నిబంధనలు అమలులో ఉండగా ఎలాంటి అనుమతి లేకుండా బండి దీక్షకు పూనుకున్నారు. వాస్తవానికి జాగరణ విషయం తెలిసి పోలీసులు ఆదివారం మధ్యాహ్నమే ఎంపీ కార్యాలయానికి నోటీసు జారీ చేశారు. కానీ పట్టించుకోలేదు. జనాన్ని పోగేసి దీక్ష చేపట్టారు. అక్కడ కూర్చున్నవారిలో చాలా మందికి మాస్కులేదు. అంతా గుమిగూడి ఉండగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి జాగరణను అడ్డుకున్నారు.
ఇంకెన్నాళ్లీ దొంగ నాటకాలు..
నిజానికి టీచర్ల బదిలీలకు సంబంధించిన 317 జీవో గుర్తింపు పొందిన ఎనిమిది ఉపాధ్యాయ సంఘాలతోపాటు.. గుర్తింపులేని సంఘాలతో చర్చించి, వారి ఆమోదం మేరకే జారీ అయింది. ఈ విషయా న్ని ముందుగా బండి సంజయ్ తెలుసుకోవాలి. ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా రాజకీయ లబ్ధికోసమే డ్రామాలాడుతున్నడు. సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. కానీ ఇలా కరోనా టైంలో జాగరణ పేరిట జనాన్ని పోగేసి దొంగనాటకాలు చేయడం కరెక్ట్ కాదు. అనుమతి లేకుండా జాగరణ చేస్తే ఎలాగూ పోలీసులు అరెస్టు చేస్తారని, తద్వారా పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి గొడవలు సృష్టించి సింపతీ పొందాలని ప్లాన్ వేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. కొవిడ్ విస్తరిస్తే బండే బాధ్యత వహించాలి. – విలేకరులతో మంత్రి గంగుల